Afghanistan win hearts in Double Super Over: టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా చేతిలో అఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా, తన అద్భుత పోరాటంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
క్రికెట్ అంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, అంతకు మించిన భావోద్వేగం అని అఫ్ఘనిస్తాన్ జట్టు మరోసారి నిరూపించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో మాత్రం అఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు నిలిచిపోయారు. డబుల్ సూపర్ ఓవర్ వరకు సాగిన ఈ పోరాటంలో అఫ్ఘాన్ ఆటగాళ్లు చూపిన ధైర్యం, ఆత్మవిశ్వాసం పరాకాష్టకు చేరాయి. చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయిన ఆ జట్టు కన్నీళ్లు నేడు ప్రతి క్రికెట్ అభిమానిని కలచివేస్తున్నాయి.
26
సౌతాఫ్రికా భారీ స్కోరు.. అఫ్ఘన్ పట్టుదల
ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టుకు ర్యాన్ రికల్టన్ (61), క్వింటన్ డికాక్ (59)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఒక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించినా, అఫ్ఘన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 3 వికెట్లతో దక్షిణాఫ్రికా వేగాన్ని అడ్డుకోగా, కెప్టెన్ రాషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో 2 వికెట్లు తీసి సఫారీలను నియంత్రించాడు. డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్లు ఉన్నా, అఫ్ఘాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేశారు.
36
రహమనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటం
లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి అఫ్ఘనిస్తాన్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. 42 బంతుల్లో 84 పరుగులు చేసి, స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకానొక దశలో మ్యాచ్ చేజారిపోతుందనుకున్న తరుణంలో గుర్బాజ్ ఇన్నింగ్స్ అఫ్ఘన్ ఆశలను సజీవంగా ఉంచింది. అతనికి తోడుగా చివర్లో నూర్ అహ్మద్ (15 నాటౌట్) వీరోచితంగా ఆడి స్కోరును సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఫజల్హక్ ఫారూఖీ రనౌట్ అవ్వడం ఆఫ్ఘన్ శిబిరంలో తీవ్ర ఉద్వేగాన్ని నింపింది.
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 17 పరుగులు చేసింది. ఒమర్జాయ్ ఫోర్, సిక్సర్‌తో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. ట్రిస్టన్ స్టబ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదడంతో మొదటి సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. ఇరు జట్ల ఆటగాళ్లలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. మైదానంలోని అభిమానుల గుండె చప్పుడు ఆగిపోయేంత ఉత్కంఠ నెలకొంది.
56
రెండో సూపర్ ఓవర్: వీరోచితంగా పోరాడి ఓడి..
రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 23 పరుగులు రాబట్టి అఫ్ఘనిస్తాన్‌కు కఠినమైన టార్గెట్ ను నిర్దేశించింది. 24 పరుగులు చేయాల్సిన తరుణంలో గుర్బాజ్ మళ్ళీ క్రీజులోకి వచ్చాడు. కేశవ్ మహారాజ్ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాది విజయానికి అడుగు దూరంలో నిలిచాడు. చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన సమయంలో గుర్బాజ్ క్యాచ్ అవుట్ అవ్వడంతో ఆఫ్ఘన్ కల చెదిరిపోయింది. అప్పటివరకు గెలుపు కోసం శ్రమించిన గుర్బాజ్ మైదానంలోనే కుంగిపోవడం చూసి అభిమానుల కళ్లు చెమర్చాయి.
66
నెట్టింట వైరల్ అవుతున్న గుర్బాజ్ కన్నీళ్లు
నెట్టింట వైరల్ అవుతున్న గుర్బాజ్ కన్నీళ్లు వైరల్ గా మారాయి. ఈ ఓటమితో అఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకున్నా, వారు చూపించిన తెగువను ఎవరూ మర్చిపోలేరు. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును డబుల్ సూపర్ ఓవర్ వరకు నెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. రషీద్ ఖాన్ నాయకత్వంలో ఈ చిన్న జట్టు చూపిన పోరాట పటిమ మిరాకిల్ కంటే తక్కువేమీ కాదు. మ్యాచ్ గెలిచింది దక్షిణాఫ్రికానే కావొచ్చు, కానీ అందరి హృదయాలను మాత్రం అఫ్ఘనిస్తాన్ గెలుచుకుంది.