Super Over Records: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్ లు జరిగాయి? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2026 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచుతోంది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
ఒక బ్లాక్ బస్టర్ సినిమాను తలపించేలా సాగిన ఈ మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా డబుల్ సూపర్ ఓవర్ నమోదైంది. ఈ పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, అఫ్గానిస్థాన్ అద్భుత పోరాటం చేసి అభిమానుల మనసు గెలుచుకుంది.
26
అహ్మదాబాద్‌లో హై వోల్టేజ్ డ్రామా.. డబుల్ సూపర్ ఓవర్
ఈ చరిత్రాత్మక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు కూడా సరిగ్గా 187 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారితీసింది.
మొదటి సూపర్ ఓవర్‌లో రెండు జట్లు చెరో 17 పరుగులు చేయడంతో మరోసారి టై అయ్యింది. రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా, అఫ్గానిస్థాన్ 19 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
36
2007లో బౌల్ అవుట్: భారత్-పాక్ మధ్య తొలి టై
టీ20 ప్రపంచకప్ 2007లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్‌లు టై అయ్యాయి. అయితే, మొదటిసారిగా భారత్-పాకిస్థాన్ మధ్య డర్బన్‌లో జరిగిన మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్ నిబంధన లేదు. ఆ సమయంలో బౌల్ అవుట్ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్, పాకిస్థాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.
ప్రపంచకప్‌లో అధికారికంగా మొదటి సూపర్ ఓవర్ 2012లో నమోదైంది. పల్లెకెలెలో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ టై (174-174 పరుగులు) కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో శ్రీలంక విజయం సాధించగా, కివీస్ జట్టుకు నిరాశ ఎదురైంది. అదే ఏడాది అదే మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన మరో మ్యాచ్ కూడా టై అయ్యింది. సూపర్ ఓవర్‌లో కివీస్ మరోసారి ఓటమిని చవిచూసింది.
56
12 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2024 రెండు సూపర్ ఓవర్లు
2012 తర్వాత టీ20 ప్రపంచకప్‌లో సూపర్ ఓవర్ చూడటానికి అభిమానులు 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 2024 టోర్నీలో నమీబియా, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్‌లో నమీబియా గెలిచింది. అదే ఏడాది అమెరికా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ పోరులో పసికూన అమెరికా, మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌కు షాకిచ్చి గెలుపొందింది. ఈ ఓటమితో పాక్ టోర్నీ నుండి అవుట్ అయింది.
66
అఫ్గానిస్థాన్‌కు వీడని సూపర్ ఓవర్ శాపం
అఫ్గానిస్థాన్ జట్టుకు సూపర్ ఓవర్ కలిసి రావడం లేదు. 2024లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అఫ్గాన్ డబుల్ సూపర్ ఓవర్ ఆడి ఓడిపోయింది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో కలిపి, అఫ్గానిస్థాన్ ఇప్పటివరకు మూడు అంతర్జాతీయ టీ20 సూపర్ ఓవర్లు ఆడగా, మూడింటిలోనూ ఓటమి పాలైంది. ప్రపంచకప్ చరిత్రలో మొదటి డబుల్ సూపర్ ఓవర్ ఆడిన జట్టుగా అఫ్గాన్ రికార్డు సృష్టించినా, ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది.