Rohit Sharma : 27 ఫోర్లు సిక్సర్లతో రఫ్ఫాడించిన రోహత్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీలో హిట్ మ్యాన్ షో

Published : Dec 24, 2025, 04:36 PM IST

Rohit Sharma : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. సిక్కింపై కేవలం 94 బంతుల్లో 155 పరుగులతో చెలరేగి ముంబైకి ఘన విజయాన్ని అందించాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

PREV
16
రోహిత్ శర్మ విధ్వంసం: 94 బంతుల్లో 155 పరుగులు.. సిక్కింపై ముంబై ఘన విజయం

భారత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీ ఆరంభం రోజే పరుగుల వరద పారింది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ తమ అద్భుతమైన సెంచరీలతో టోర్నీకి కిక్ ఇచ్చారు.

అయితే, యువకులకు తానేమీ తీసిపోనని నిరూపిస్తూ, టీమిండియా సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. జైపూర్ లో సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్.. భారీ సెంచరీతో అభిమానులను అలరించాడు.

26
ఏడేళ్ల తర్వాత దేశవాళీ బరిలో రోహిత్ శర్మ

సుమారు ఏడేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు మైదానంలోకి దిగాడు. బీసీసీఐ సూచనల మేరకు సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్ మ్యాన్, తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సిక్కిం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆ తర్వాత 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.

36
62 బంతుల్లోనే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ

ముంబై ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రోహిత్ శర్మ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. సిక్కిం బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే తన తుపాను బ్యాటింగ్ ను మొదలుపెట్టాడు. బౌలర్ల పై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించాడు.

తన క్లాస్ టైమింగ్, పవర్ హిట్టింగ్‌తో మైదానం నలువైపులా షాట్లు ఆడాడు. కేవలం 62 బంతుల్లోనే రోహిత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది అతని లిస్ట్-ఏ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఒకటిగా నిలిచింది. కవర్ డ్రైవ్స్, తన ట్రేడ్‌మార్క్ పుల్ షాట్స్, భారీ సిక్సర్లతో రోహిత్ ఇన్నింగ్స్ సాగింది.

46
27 బౌండరీలతో 155 పరుగులు చేసిన రోహిత్ శర్మ

సెంచరీ పూర్తయ్యాక రోహిత్ మరింత ప్రమాదకరంగా మారాడు. సిక్కిం బౌలింగ్ ఎటాక్‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. మొత్తం 94 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 155 పరుగులు సాధించి ఔటయ్యాడు.

రోహిత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అంటే కేవలం బౌండరీల ద్వారానే 126 పరుగులు రాబట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 164.89గా నమోదైంది. రోహిత్ దాటికి సిక్కిం బౌలర్లు చేతులెత్తేశారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ తాను ఎంత గొప్ప వన్డే ప్లేయరో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు.

56
రోహిత్ సునామీ నాక్ తో ముంబైకి 8 వికెట్ల భారీ విజయం

రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ముంబై జట్టు లక్ష్యాన్ని చాలా సులభంగా ఛేదించింది. కేవలం 30.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి విజయం సాధించింది.

రోహిత్ శర్మ (155)తో పాటు రఘువంశీ 38 పరుగులు చేశాడు. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ 5 బంతుల్లో 8 పరుగులు, అతని సోదరుడు ముషీర్ ఖాన్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో ముంబై జట్టు విజయ్ హజారే ట్రోఫీ 2025-26ను ఘనంగా ప్రారంభించింది.

66
రోహిత్ అద్భుత ఫామ్.. అభిమానులకు పండగే

అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీగా ఉండే రోహిత్, ఇలా దేశవాళీ క్రికెట్‌కు వచ్చి ఆడటం టోర్నీకి ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. ముంబై జట్టు టోర్నీలో ముందంజ వేయడానికి రోహిత్ ఫామ్ ఎంతో కీలకం కానుంది.

మరోవైపు, రోహిత్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎంత భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడో సెలెక్టర్లకు, అభిమానులకు ఈ ఇన్నింగ్స్ ద్వారా స్పష్టమైంది. సిక్కిం జట్టుపై సాధించిన ఈ విజయం ముంబై జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ముంబై తుది జట్టు (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేశ్ లాడ్, ముషీర్ ఖాన్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), షామ్స్ ముల్రాని, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా.

సిక్కిం తుది జట్టు (ప్లేయింగ్ XI): లీ యోంగ్ లెప్చా (కెప్టెన్), ఆశిష్ థాపా (వికెట్ కీపర్), అమిత్ రాజేరా, రాబిన్ లింబూ, గురిందర్ సింగ్, క్రాంతి కుమార్, పాల్జోర్ తమాంగ్, అంకుర్ మాలిక్, కే సాయి సాత్విక్, ఎండీ సప్తుల్లా, అభిషేక్ కుమార్ షా.

Read more Photos on
click me!

Recommended Stories