భారత క్రికెట్‌లో హిట్‌మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ శర్మ, తన అద్భుత బ్యాటింగ్ శైలి, తనదైన నాయకత్వం, అత్యున్నత స్థాయి మ్యాచ్ టెంపరమెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అరుదైన ఆటగాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో తొలి అడుగు నుంచి 2024లో భారత జట్టుకు టీ20 కప్ అందించిన కెప్టెన్‌గా మారే వరకు, రోహిత్ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.
రికార్డులు, ధైర్యమైన ఆరంభాలు, మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సామర్థ్యం.. ఇవి అన్నీ కలిపి రోహిత్ ను ఆధునిక క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టాయి.
ఈ క్రమంలోనే మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌కు రోహిత్ శర్మను టోర్నమెంట్ అంబాసిడర్‌గా ఐసీసీ ప్రకటించింది. 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను భారత జట్టుకు అందించిన రోహిత్, మరోసారి ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో తనదైన పాత్ర పోషించనున్నాడు. భారత్, శ్రీలంకల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది.