Rohit Sharma: రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత మధ్య బీసీసీఐ ఆయనకు కీలక మెసేజ్ పంపింది. ఫిట్నెస్, ప్రదర్శనపై దృష్టి పెట్టాలని, భవిష్యత్తు ఊహాగానాలను పట్టించుకోవద్దని సూచించింది.
టెస్ట్ క్రికెట్, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 2027 ప్రపంచకప్‌లో "హిట్ మ్యాన్" రోహిత్ శర్మ పాల్గొంటాడా లేదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో నిరంతరం చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోహిత్ శర్మకు కీలకమైన స్పష్టతను ఇచ్చింది. బీసీసీఐ నేరుగా రోహిత్ శర్మకు మెసేజ్ పంపడం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది.
25
సూపర్ ఫాంలో రోహిత్
రోహిత్ శర్మ 2024 జూన్ 29న టీ20లకు, అలాగే 2025 మే 7న టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఎలా ఉండబోతోందనే చర్చలు కొనసాగుతున్న తరుణంలో, బీసీసీఐ రోహిత్ శర్మతో సంప్రదించడం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫామ్ కోల్పోవడం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రోహిత్‌ను జట్టు నుంచి తప్పించవచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్న సమయంలో, ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అతను అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రదర్శన రోహిత్ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది.
35
రోహిత్ శర్మకు ప్రత్యేక మెసేజ్..
తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరిన సంగతి తెలిసిందే. అలాగే రాంచీ వన్డేలో అర్ధ సెంచరీతో అదరగొట్టాడు రోహిత్ శర్మ. ఇదిలా ఉంటే.. నవంబర్ 29న బీసీసీఐ రోహిత్ శర్మకు ఒక ప్రత్యేక మెసేజ్ పంపింది. ఈ మెసేజ్లో రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్, ప్రదర్శనపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని, తన భవిష్యత్తు గురించిన ఎటువంటి ఊహాగానాలను పట్టించుకోవద్దని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో కనబరిచిన దూకుడు, నిర్భయమైన బ్యాటింగ్ శైలిని కొనసాగించాలని రోహిత్‌కు సూచించింది. ఆస్ట్రేలియాలో పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, రోహిత్ అక్కడ అత్యధిక పరుగులు సాధించి తన సత్తా చాటాడు.
ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లితో కలిసి టీమిండియాను ముందుండి నడిపించాలని రోహిత్ శర్మకు బీసీసీఐ ఆ మెసేజ్‌లో తెలిపింది. ఇది రోహిత్ నాయకత్వ లక్షణాలపై బీసీసీఐకున్న నమ్మకాన్ని సూచిస్తోందని అభిమానులు అంటున్నారు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల భవిష్యత్తుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది.
55
రోహిత్ భవిష్యత్తు ఏంటి.?
సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత ఈ అంశంపై ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వారి భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని బీసీసీఐకి చెందిన వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలు రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో కొత్త మలుపునకు దారి తీయనుంది.