Published : Nov 09, 2025, 10:54 PM ISTUpdated : Nov 09, 2025, 11:08 PM IST
Richa Ghosh DSP : ప్రపంచ కప్ లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా ఘోష్ కు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డీఎస్పీ పదవిని ఇచ్చింది. అలాగే, బంగభూషణ్ అవార్డు ప్రదానం చేసింది.
భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకరైన రిఛా ఘోష్ కు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రెండు గొప్ప గౌరవాలను అందించింది. 2025 మహిళా ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఆమెను వెస్ట్ బెంగాల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించారు. అలాగే, ఆమెకు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘బంగభూషణ్’ అవార్డును కూడా ప్రదానం చేశారు.
26
ఈడెన్ గార్డెన్స్‌లో రిచా ఘోష్ కు ఘన సత్కారం
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో రిచా ఘోష్ కు ఈ సత్కారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, లెజెండరీ బౌలర్ ఝులన్ గోస్వామిల సమక్షంలో రిచా ఘోష్ డీఎస్పీ నియామక పత్రాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలోనే ఆమెకు ప్రభుత్వం నుండి బంగభూషణ్ పతకం, బంగారు గొలుసు, అలాగే రూ. 34 లక్షల నగదు బహుమతి ప్రదానం చేశారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఆమెను ‘గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్’ తో సత్కరించింది. ఈ రూ. 34 లక్షలు ప్రపంచకప్ ఫైనల్‌లో రిచా ఘోష్ చేసిన 34 పరుగులలో రన్ కు లక్ష చోప్పున అందజేశారు.
36
ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన రిఛా ఘోష్
రిచా ఘోష్ 2025 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించారు. ఆమె ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 235 పరుగులు చేసి, భారత ఆటగాళ్లలో అత్యధిక పరుగుల పరంగా ఐదో స్థానంలో నిలిచారు.
దక్షిణాఫ్రికాపై గ్రూప్ దశలో చేసిన 94 పరుగులు ఆమె కెరీర్‌లో కీలక ఇన్నింగ్స్ కాగా, సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 16 బంతుల్లో 26 పరుగులు, ఫైనల్‌లో 24 బంతుల్లో 34 పరుగులు భారత విజయంలో కీలకంగా నిలిచాయి.
ఫైనల్‌లో భారత్ 298/7 పరుగులు సాధించింది. షఫాలి వర్మ (87), దీప్తి శర్మ (58)తో పాటు రిచా ఘోష్ చివర్లో వేగంగా ఆడుతూ జట్టు స్కోరును పెంచింది. దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌటవడంతో భారత్ తొలిసారి మహిళా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
రిచా ఘోష్ పై సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి ప్రశంసలు
CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రిచా ఘోష్ పై ప్రశంసలు కురిపించారు. దాదా మాట్లాడుతూ.. “నంబర్ 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడం సులభం కాదు. రిచా స్ట్రైక్ రేట్ భారత్‌కు విజయాన్ని అందించింది” అని అన్నారు.
ఝులన్ గోస్వామి మాట్లాడుతూ.. “2013లో బెంగాల్ క్రికెట్ బలహీనంగా ఉన్నప్పుడు టాలెంట్ హంట్ కార్యక్రమం ప్రారంభించాము. అప్పుడు సిలిగురిలోనే నేను తొలిసారి రిచాను చూశాను” అని భావోద్వేగంతో చెప్పారు.
56
మమతా బెనర్జీ ఏమన్నారంటే?
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... “ఝులన్ గోస్వామి వంటి మహిళలు మహిళా క్రికెట్‌కు పునాది వేశారు. రిచా ఘోష్ ఆ కలను నెరవేర్చింది. ఆమెకు గొప్ప భవిష్యత్తు ఉంది. కానీ మేము ఆమెపై ఒత్తిడి చేయము. ప్రతి క్రీడలో బెంగాల్ యువత ముందుకు రావాలి” అని అన్నారు.
ఆమెతో పాటు రిచా ఘోష్ తల్లిదండ్రులు మనబేంద్ర ఘోష్, స్వప్న ఘోష్‌లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.
66
రైజింగ్ స్టార్ రిచా ఘోష్
22 ఏళ్ల రిచా ఘోష్.. సిలిగురి యువతి, ఇప్పుడు డీఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టబోతోంది. 2020లో భారత జట్టులో అరంగేట్రం చేసిన ఆమె, 2023లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైంది.
ఇప్పుడు ఆమె 2025 సీనియర్ మహిళా ప్రపంచకప్ గెలిచిన జట్టులో ముఖ్య పాత్ర పోషించింది. క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ప్రభుత్వ సేవలో అడుగుపెడుతున్న ఆమె కథ ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది.