RCB : బెంగళూరులో నో IPL మ్యాచ్‌.. ఆర్సీబీ కొత్త అడ్డా ఫిక్స్ ! కోహ్లీ అభిమానులకు షాక్

Published : Jan 09, 2026, 04:09 PM IST

RCB : ఐపీఎల్ 2026లో ఆర్సీబీ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగకపోవచ్చు. గత ఏడాది జరిగిన విషాద ఘటనతో తమ హోం గ్రౌండ్ ను రాయ్‌పూర్ లేదా ఇండోర్‌కు మార్చే యోచనలో ఫ్రాంచైజీ ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
బెంగళూరులో ఇక 'ఈ సాలా కప్ నమ్దే' వినిపించదా? ఆర్సీబీ సంచలన నిర్ణయం!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఒక చేదు వార్త అందుతోంది. దశాబ్దాలుగా ఆర్సీబీకి కంచుకోటగా ఉన్న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో వచ్చే సీజన్ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వార్త ఆర్సీబీ అభిమానుల గుండెలు పగిలేలా చేసింది.

తాజా రిపోర్టుల ప్రకారం, ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు సుముఖంగా లేదు. భద్రతా కారణాల దృష్ట్యా, గత అనుభవాల నేపథ్యంలో, బెంగళూరుకు బదులుగా తమ హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్ లేదా ఇండోర్‌లో నిర్వహించేందుకు ఫ్రాంచైజీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

26
ఆర్సీబీ కొత్త హోం గ్రౌండ్ ఏది? రాయ్‌పూర్ లేదా ఇండోర్?

ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ తమ కొత్త హోమ్ గ్రౌండ్‌గా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లేదా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను ఎంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయ్‌పూర్ పేరు ఈ రేసులో ముందు వరుసలో వినిపిస్తోంది. ఆర్సీబీ యాజమాన్యం తమ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇప్పటివరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)తో ఎలాంటి చర్చలు జరపకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుండి బెంగళూరు ఆర్సీబీకి సొంతగడ్డగా ఉంది, కానీ వచ్చే సీజన్‌లో ఇది మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

36
IPL : గత ఏడాది జరిగిన పెను విషాదం

ఆర్సీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం గత ఏడాది (ఐపీఎల్ 2025) జరిగిన పెను విషాదమే. 2025 సీజన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జట్టుకు ఇది తొలి ఐపీఎల్ టైటిల్ కావడంతో, చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకను చూసేందుకు లక్షలాదిగా అభిమానులు స్టేడియం లోపల, బయట పోటెత్తారు. అభిమానుల సంఖ్య అంచనాలకు మించిపోవడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో 11 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన జట్టుపై తీవ్ర వ్యతిరేకతను, చెడ్డ పేరును తీసుకువచ్చింది.

46
హెచ్చరికలు బేఖాతరు..

ట్రోఫీ సెలబ్రేషన్ సమయంలో పరిస్థితి అదుపు తప్పిందని, తొక్కిసలాట పరిస్థితి ఉందని ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమ్ కామెంట్లలో చాలా మంది హెచ్చరించినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ఆర్సీబీ సోషల్ మీడియా బృందం ఈ విషయాన్ని గమనించకుండా లైవ్ కొనసాగించిందని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని ఆరోపణలు వచ్చాయి.

మరణాల వార్త తెలిసిన తర్వాతే అధికారులు, ఆటగాళ్లు వేడుకలను మధ్యలోనే నిలిపివేశారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం, ఆర్సీబీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి.

56
విరాట్ కోహ్లీ క్రేజ్.. భద్రతా సవాళ్లు

చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీకి ఉన్న ఆదరణ అసాధారణమైనది. గత ఏడాది డిసెంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, ఆంధ్రా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను చివరి నిమిషంలో చిన్నస్వామి స్టేడియం నుంచి మార్చాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టులో ఉండటంతో, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భావించారు.

తొక్కిసలాట భయంతో బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆ మ్యాచ్‌ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించారు. భద్రతా పరమైన ఈ ఇబ్బందుల కారణంగానే ఆర్సీబీ 2026లో తమ మ్యాచ్‌లను బెంగళూరు వెలుపల నిర్వహించాలని యోచిస్తోంది.

66
రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ కూడా మార్పు

మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా తమ హోం గ్రౌండ్ ను జైపూర్ నుంచి పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియానికి మార్చినట్లు సమాచారం. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA)తో ఉన్న విభేదాల కారణంగా ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. 

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, అంతర్గత గొడవల వల్ల రాజస్థాన్ రాయల్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఐపీఎల్ 2026లో రెండు ప్రధాన జట్లు తమ సొంతగడ్డకు దూరంగా మ్యాచ్‌లు ఆడే పరిస్థితులు నెలకొన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories