T20 World Cup : షాకింగ్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు

Published : Jan 02, 2026, 03:35 PM IST

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌ 2026 పై టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టోర్నీల ఫ్రీక్వెన్సీ, చిన్న జట్ల వల్ల మ్యాచ్‌లలో నాణ్యత తగ్గడంపై ఐసీసీని హెచ్చరించారు.

PREV
16
వరల్డ్ కప్ ఫార్మాట్ మార్చాల్సిందే.. లేదంటే కష్టమే

త్వరలోనే మరో క్రికెట్ సమరం మొదలు కానుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే, టీమిండియా మాజీ స్పిన్నర్, సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి గట్టి హెచ్చరిక చేశాడు. 2026లో జరగబోయే ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్‌పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఈ మెగా టోర్నీని ఎవరూ చూడకపోవచ్చని, ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, అలాగే టోర్నీలో పాల్గొంటున్న జట్ల మధ్య నాణ్యతలో భారీ అంతరం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అశ్విన్ విశ్లేషించారు. టోర్నమెంట్ ప్రారంభ దశలో జరిగే ఏకపక్ష మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఈ ఈవెంట్ నుండి దూరం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

26
అసలు అశ్విన్ ఏమన్నారంటే?

తన యూట్యూబ్ ఛానెల్ లో అశ్విన్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈసారి జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను ఎవరూ చూడరు అనిపిస్తోంది. ఎందుకంటే టోర్నీలో పోటీ అనేది నామమాత్రంగా మారుతోంది. భారత్ వర్సెస్ అమెరికా, భారత్ వర్సెస్ నమీబియా వంటి మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించరు. ఇలాంటి మ్యాచ్‌లు మిమ్మల్ని నిజంగానే ప్రపంచ కప్ నుండి దూరం చేస్తాయి" అని అశ్విన్ కుండబద్దలు కొట్టాడు. అభిమానులకు కావాల్సింది హోరాహోరీ పోరు అని, ఏకపక్ష మ్యాచ్‌లు కాదని ఆయన స్పష్టం చేశారు.

36
గతానికి, ప్రస్తుతానికి ఉన్న తేడా ఇదే

ప్రపంచ కప్ షెడ్యూలింగ్ విధానంపై అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. "గతంలో టీ20 ప్రపంచ కప్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేది. అందుకే అప్పట్లో ఆ టోర్నీపై విపరీతమైన ఆసక్తి, ఉత్కంఠ ఉండేది. అంతేకాకుండా, అప్పట్లో భారత్ వంటి పెద్ద జట్లు మొదటి రౌండ్‌లోనే ఇంగ్లండ్ లేదా శ్రీలంక వంటి బలమైన జట్లతో తలపడేవి. ఆ మ్యాచ్‌లలో మజా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది" అని అశ్విన్ పేర్కొన్నాడు. పెద్ద జట్లు, చిన్న జట్ల మధ్య మ్యాచ్‌లు సాగదీసినట్లుగా ఉండటం వల్ల అసలైన కిక్ మిస్ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డాడు.

46
జట్ల మధ్య పెరుగుతున్న నాణ్యతా లోపం

ఐసీసీ టోర్నమెంట్లలో పాల్గొంటున్న జట్ల నాణ్యతపై కూడా అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్‌లో అప్పుడప్పుడే ఎదుగుతున్న జట్లు, ఇప్పటికే స్థిరపడిన దిగ్గజ జట్ల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందని ఆయన గుర్తుచేశారు.

దీనివల్ల టోర్నమెంట్ ప్రారంభ రౌండ్లలో జరిగే మ్యాచ్‌లు ఏకపక్షంగా, ఎలాంటి పోటీ లేకుండా ముగుస్తున్నాయని అన్నారు. ఇలాంటి మిస్ మ్యాచ్ ల వల్ల టోర్నీలో ఉండాల్సిన అసలైన థ్రిల్, కాంపిటీషన్ కనుమరుగవుతోందని అశ్విన్ విశ్లేషించారు.

56
వరుసగా ఐసీసీ ఈవెంట్స్.. అభిమానులకు విసుగు

క్రికెట్ క్యాలెండర్‌లో ఐసీసీ ఈవెంట్ల వరద పారడం కూడా అభిమానుల ఆసక్తిని తగ్గిస్తోందని గణాంకాలతో సహా అశ్విన్ వివరించారు. 2010 నుండి 2018 మధ్య కాలాన్ని మినహాయిస్తే, దాదాపు ప్రతి సంవత్సరం ఐసీసీ టోర్నమెంట్లు జరుగుతూనే ఉన్నాయి.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ వాయిదా పడి 2021లో జరిగింది. ఆ తర్వాత 2022లో మరో టీ20 వరల్డ్ కప్, 2023లో వన్డే వరల్డ్ కప్, 2024లో మళ్ళీ టీ20 వరల్డ్ కప్ జరిగాయి. ఇక 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, వెంటనే 2026లో మరో టీ20 ప్రపంచ కప్ రానుంది. ఇలా విరామం లేకుండా టోర్నీలు నిర్వహించడం వల్ల ఆకర్షణ తగ్గుతోందని అశ్విన్ వాదించారు.

66
టైటిల్‌ను నిలబెట్టుకునే ఫేవరెట్ జట్లలో భారత్

2026లో జరగబోయే ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. టైటిల్‌ను నిలబెట్టుకునే ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటిగా ఉంది. ఈ కాంపిటీషన్ మొత్తం ఐదు గ్రూపులుగా జరగనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆతిథ్య భారత్ తన మొదటి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. అశ్విన్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నది ఇలాంటి మ్యాచ్‌ల గురించే కావడం గమనార్హం.

Read more Photos on
click me!

Recommended Stories