మెడ‌ల్స్ ప‌క్కా.. పారిస్ ఒలింపిక్స్ లో భార‌త బాక్స‌ర్లు వీరే !

First Published | Jul 23, 2024, 12:41 PM IST

Paris Olympics 2024 - Indian boxers : బాక్సింగ్‌లో భారత్ గత నాలుగు ఒలింపిక్స్‌లో మూడింటిలో పతకాలు సాధించింది. వీటిలో చివరి రెండు పతకాలను మహిళా బాక్సర్లు మేరీ కోమ్, లోవ్లినా బోర్గోహెన్ గెలుచుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 లో లోవ్లీనాతో పాటు నికత్ జరీన్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 
 

Paris Olympics 2024 - Indian boxers : పారిస్ ఒలింపిక్స్‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదిక‌గా జరగనున్న ఈ ప్రపంచ క్రీడ‌ల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్ల పై భారీ అంచనాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈ ఏడాది పతకాల సంఖ్యను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో బాక్సర్ల పాత్ర కీలకం కానుంది. దీంతో అందరి దృష్టి బాక్సింగ్ పై ఉంది. భార‌త నుంచి బాక్సింగ్ లో ఆరు మంది భార‌త బాక్స‌ర్లు పాల్గొంటున్నారు.

Image credit: PTI

న‌లుగురు మహిళా బాక్సర్లు

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు చెందిన ఇద్దరు పురుషులు, న‌లుగురు మహిళా బాక్సర్లు పోటీ ప‌డుతున్నారు. పురుష‌ అథ్లెట్లలో అమిత్ పంఘల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) బ‌రిలో ఉన్నారు. మహిళా బాక్సర్లలో లోవ్లినా బోర్గోహెన్ (75 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జాస్మిన్ లంబోరియా (57 కేజీలు) లు మెడ‌ల్స్ పోరులో ఉన్నారు. 


నిఖత్ జరీన్ (50 కిలోలు)

నిఖ‌త్ జరీన్ 2022 ఆసియా క్రీడల సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించి ఒలింపిక్ బెర్త్ ను క‌న్ఫ‌ర్మ్ చేసుకుంది. 28 ఏళ్ల తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జరీన్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. 2022, 2023లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో ఆమె వరుసగా రెండు గోల్డ్ మెడ‌ల్స్ సాధించింది. జరీన్ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉండడంతో ఒలింపిక్ పతకంపై ఆశలు పెట్టుకుంది. ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియల్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. గత నెలలో కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించింది. 

Preeti Pawar

ప్రీతి పవార్ (మహిళలు 54 కేజీలు)

ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్స్‌లో కజకిస్థాన్‌కు చెందిన జైనా షెకెర్‌బెకోవాను ఓడించి ప్రీతి పవార్ ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించింది. ఇక్క‌డ ప్రీతి కాంస్య పతకం గెలుచుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 35వ ర్యాంక్‌లో ఉన్న ప్రీతి.. ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ల జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలు కూడా, 

Lovlina Borgohain

లోవ్లినా బోర్గోహెన్ (మహిళల 75 కేజీలు)

లోవ్లినా బోర్గోహెన్ ప్రస్తుతం ప్రపంచ ర్యాంక్‌లో 4వ స్థానంలో ఉంది. చెక్ రిపబ్లిక్‌లో ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రి 2024లో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. బాక్సింగ్ ప్రపంచంలో త‌న‌దైన ముద్ర వేసింది. ఇదివ‌ర‌కే ఒక ఒలింపిక్ కాంస్య పతకం గెలుచుకుంది. అలాగే, మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు కూడా సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో 69 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆమె ఈ ఏడాది పారిస్‌లో 75 కిలోల విభాగంలో బాక్సింగ్ రింగ్‌లోకి దిగ‌నుంది. 

అమిత్ పంఘల్ (పురుషుడు 51 కేజీలు)

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) మూల్యాంకన విధానం కారణంగా అమిత్ పంఘల్ భారత బాక్సింగ్ జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అందుకే ప్యారిస్ ఒలింపిక్స్ లో చోటు కోసం అనేక ఇబ్బందులు ప‌డ్డాడు. చివరకు బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ క్వాలిఫైయర్స్‌లో చైనాకు చెందిన లియు చువాంగ్‌ను 5–0తో ఓడించి ఒలింపిక్స్ లో చోటుద‌క్కించుకున్నాడు. పంఘల్‌కి ఇది రెండో ఒలింపిక్స్‌. అంతకుముందు అతను టోక్యో ఒలింపిక్స్ 2020లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కానీ ప‌త‌కం సాధించ‌లేక‌పోయాడు. కాగా, ఇదివరకు కామన్వెల్త్‌లో రజతం, బంగారు పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, రజతం, స్వర్ణాలను గెలుచుకున్నాడు. 

Nishant Dev

నిశాంత్ దేవ్ (పురుషుడు 71 కేజీలు)

బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో పురుషుల బాక్సింగ్‌లో భారత్ త‌ర‌ఫున తొలి ఎంట్రీ నిశాంత్ దేవ్ నుంచి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో అతను 5-0తో వాసిల్ సెబోతారిని ఓడించాడు. ప్రపంచ ర్యాంక్‌లో ఏడో స్థానంలో ఉన్న నిశాంత్ తన తొలి ఒలింపిక్ పతకంపై ఇప్పుడు కన్నేశాడు. 2023 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిశాంత్ కాంస్య పతకాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. 

Nikhat Zareen, Lovlina Borgohain, Indian boxers

జాస్మిన్ లంబోరియా (ఆడ 57 కేజీలు)

ప్రపంచ ర్యాంకింగ్స్ లో 22వ ర్యాంక్‌లో ఉన్న జాస్మిన్ లాంబోరియా కొన్ని వారాల ముందు వ‌ర‌కు ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఎరీనాలో కూడా లేదు. కానీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పర్వీన్ హుడాపై సస్పెన్షన్ విధించడంతో జాస్మిన్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది. జూన్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో క్వార్టర్-ఫైనల్స్‌లో మాలికి చెందిన మారిన్ కమరాను ఓడించడంతో ఈ అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

Latest Videos

click me!