రవీంద్ర జడేజా క్రికెట్ కెరీర్ ముగిసిందా?

First Published | Jul 23, 2024, 11:47 AM IST

Ravindra Jadeja : జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య 3 టీ20, 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు ఇప్ప‌టికే బీసీసీఐ జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే, టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్, ప్ర‌పంచ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు. 
 

Ravindra Jadeja-Rahul Dravid

Ravindra Jadeja : భారత్-శ్రీలంక మధ్య 3 టీ20, 3 వన్డేల సిరీస్ జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటన కోసం బీసీసీఐ టీ20, వన్డే భార‌త‌ జట్లను ప్రకటించింది. జట్టు ప్రకటన తర్వాత టీమిండియాకు ప్లేయ‌ర్ల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహా కీలక ప్లేయర్లను జట్టు నుండి తప్పించడం పట్ల అసంతృప్తితో ఉన్న చాలా మంది మాజీ ఆటగాళ్లు జట్టు ఎంపికను ప్రశ్నించారు. ఏ ప్రాతిప‌దిక‌న జ‌ట్టును ఎంపిక చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జ‌ట్టులో చోటుద‌క్క‌ని రవీంద్ర జడేజా భవితవ్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. 


భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ గెలిచిన త‌ర్వాత అత‌ను టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికాడు. వ‌న్డే, టెస్ట్ ఫార్మాట్ ల‌లో ఆడ‌తాన‌ని చెప్పాడు. అయితే, శ్రీలంక ప‌ర్య‌ట‌న కోసం ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో ఈ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ కు చోటుద‌క్క‌లేదు. 

టెస్టు జట్టులో మాత్రమే అతడిని తీసుకుంటారా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప‌లు మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. రవీంద్ర జడేజాను జట్టులో ఎంపిక చేయకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ ముందుకు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది బీసీసీఐ. 

Ravindra Jadeja

ఈ నేప‌థ్యంలోనే సెలక్టర్లు రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా ఇప్పటికీ సెలెక్టర్ల మొదటి ఎంపిక అని కూడా ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రవీంద్ర జడేజా జట్టులో కొనసాగనున్నాడు.

Ravindra Jadeja

ప్రస్తుతం రవీంద్ర జడేజాను తొలగించే ఆలోచనలో సెలక్టర్లు లేరు. అయితే, రవీంద్ర జడేజా తర్వాత అతని స్థానంలో అక్షర్ పటేల్ పూర్తిగా జ‌ట్టులోకి తీసుకుంటార‌ని స‌మాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది. దీనికి ముందు టీమిండియా 6 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే, శ్రీలంకతో 3 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌లు ఆడనుంది.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీలో రవీంద్ర జడేజాను మొదటి ఎంపికగా చూస్తోంది. దీంతో శ్రీలంకతో జరిగే సిరీస్‌లో జడేజాకు విశ్రాంతినిచ్చారు. రాబోయే సిరీస్ లో మ‌రింత‌గా అత‌ని నుంచి మంచి ప్ర‌ద‌ర్శ‌నను ఆశిస్తోంద‌ని స‌మాచారం. కాబట్టి మరికొంత కాలం జడేజాను భారత జట్టులో చూడవచ్చు. 

Latest Videos

click me!