Paris Olympics 2024, Neeraj Chopra
Paris Olympics 2024 : ప్రపంచ క్రీడా సంగ్రామం పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విశ్వక్రీడల్లో పాలుపంచుకోవడానికి ప్రపంచ దేశాల క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. జూలై 26న అద్భుతమైన ప్రారంభ వేడుకలతో పారిస్ ఒలింపిక్స్ 2024 షురూ కానుంది. ఎంతో చరిత్ర కలిగిన ఈఫిల్ టవర్ ఐకానిక్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రసంగంతో ఈ క్రీడా సంగ్రామం ప్రారంభం కానుంది.
ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై పోటీపడేందుకు విభిన్న ఖండాల నుండి వేలాది మంది అథ్లెట్లను స్వాగతిస్తూ ఈ ప్రపంచ క్రీడా మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఫ్రాన్స్ అంతా సిద్ధం చేసింది. ఈ క్రీడల్లో విజయం సాధించిన వారికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) నగదును అందించనప్పటికీ క్రీడాకారులు వారి దేశాలు లేదా ఒలింపిక్ కమిటీల నుండి భారీగానే ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకుంటారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 విజేతలకు ఆయా దేశాలు ఇప్పటికే అందించే నగదు వివరాలను పంచుకున్నాయి. భారీగా నగదుతో పాటు ఇతర బహుమతులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుత నివేదికల ప్రకారం మలేషియా, మొరాకో, సెర్బియా వంటి వివిధ దేశాలు ఒలింపిక్ పతక విజేతలకు $200,000 వరకు భారీ రివార్డులను అందిస్తామని పేర్కొన్నాయి. ఇటలీతో పాటు దాని సరిహద్దు దేశాలు సైతం పారిస్ ఒలింపిక్స్ పతకాలు సాధించిన అథ్లెట్లకు $100,000 మనీని అందించాలని భావిస్తున్నాయి. అయితే, తక్కువ జనాదరణ పొందిన క్రీడలలో అథ్లెట్‌లకు ప్రోత్సాహకంగా అందించే డబ్బు, స్పాన్సర్‌షిప్ అవకాశాలు తక్కువగా ఉండే అవకాశముంది.
పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు యూఎస్ఏ, అమెరికా ఒలింపిక్ కమిటీ రివార్డుల వివరాలు పంచుకుంటూ.. గోల్డ్ మెడల్ సాధిస్తే $37,500, సిల్వర్ మెడల్ కు $22,500, కాంస్య పతకాలకు సాధించిన అథ్లెట్లకు $15,000 అందిస్తామని తెలిపాయి. ఇది తక్కువగానే అనిపించినా యూఎస్ఏ గెలిచే మెడల్స్ తో పోలిస్తే మొత్తంగా అందించే రివార్డులు చాలా ఎక్కువగా ఉంటాయి. భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కూడా పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన క్రీడాకారులు భారీగా రివార్డులు ఇవ్వనున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.