Asianet News Exclusive : డబ్ల్యూపీఎల్ వేలం ఉత్కంఠ.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయంతో షాక్ అయ్యానన్న మిన్ను మణి

Published : Nov 28, 2025, 05:45 PM IST

WPL Auction: డబ్ల్యూపీఎల్ (WPL) వేలంలో చివరి నిమిషంలో ఢిల్లీ క్యాపిటల్స్ తనను కొనుగోలు చేయడంపై మిన్ను మణి స్పందించారు. రూ. 40 లక్షల పర్స్ మిగిలి ఉండగా, అంతే ధరకు తనను తీసుకోవడం నమ్మలేకపోతున్నానని ఏసియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ చెప్పారు.

PREV
13
చివరి క్షణాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ షాక్

WPL Auction 2025: ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్లేయర్ల వేలం పాట తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగింది. ముఖ్యంగా కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ మిన్ను మణి విషయంలో ఈ వేలం నాటకీయ మలుపులు తిరిగింది. మొదటి రౌండ్ వేలంలో ఏ జట్టూ ఆమెను కొనుగోలు చేయకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేరళ నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని ఏ జట్టూ తీసుకోదా అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది.

అయితే, ఈ ఆందోళన ఎక్కువ సేపు ఉండలేదు. వేలం చివరి దశలో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య నిర్ణయం తీసుకుని మిన్ను మణిని తిరిగి సొంతం చేసుకుంది. ఈ పరిణామం అందరినీ, ముఖ్యంగా స్వయంగా మిన్ను మణిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన కోచ్‌తో కలిసి ఢిల్లీలోని ఒక హోటల్ గదిలో కూర్చుని వేలం పాటను వీక్షించిన మిన్ను మణి, ఆ ఉత్కంఠభరితమైన క్షణాల గురించి, తన ఆనందాన్ని 'ఏసియానెట్ న్యూస్'తో పంచుకున్నారు.

మొదటి రౌండ్ వేలంలో తన పేరు వచ్చినప్పుడు ఏ జట్టూ బిడ్ చేయకపోవడం వల్ల నిరాశ చెందానని మిన్ను మణి తెలిపారు. ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆమె.. "మొదటి రౌండ్‌లో ఎవరూ నన్ను పిలవనప్పుడు కచ్చితంగా బాధ కలిగింది. అయితే, రెండో రౌండ్ ఉందనే చిన్న ఆశ మనసులో ఉండేది. కానీ చివర్లో ఆక్సిలరేటెడ్ వేలంలో ఢిల్లీ నన్ను టీమ్‌లోకి తీసుకున్నప్పుడు నిజంగా షాక్ అయ్యాను." అని చెప్పారు.

దీనికి గల కారణాన్ని వివరిస్తూ.. "చివరి రౌండ్‌కి వచ్చేసరికి టీవీ స్క్రీన్‌పై ప్రతి జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు (Purse Value) చూపిస్తున్నారు. అప్పటికి యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మినహా మిగిలిన జట్ల వద్ద చాలా తక్కువ మొత్తం మాత్రమే మిగిలి ఉంది" అని అన్నారు.

23
రూ. 40 లక్షల లెక్క పై మిన్ను మణి

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద పర్స్‌లో కేవలం రూ. 40 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిన్ను మణి కనీస ధర (Base Price) కూడా రూ. 40 లక్షలే. దీంతో ఆమెపై ఢిల్లీ బిడ్ వేస్తుందనే నమ్మకం చాలా తక్కువగా ఉంది. "ఢిల్లీ దగ్గర కేవలం 40 లక్షలు ఉన్నాయి. నా బేస్ ప్రైస్ కూడా అదే. కాబట్టి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ, వారి దగ్గర ఉన్న మొత్తం డబ్బును నా కోసమే ఖర్చు చేసి నన్ను సొంతం చేసుకోవడం నమ్మలేకపోయాను. నాపై వారికున్న నమ్మకమే దీనికి కారణమని భావిస్తున్నాను," అని మిన్ను మణి ఆనందం వ్యక్తం చేశారు.

తాను తన కోచ్ సుమన్ శర్మతో కలిసి కోచ్ ఇంట్లో కూర్చుని వేలం చూస్తున్నానని, అస్సలు ఊహించని సమయంలో ఢిల్లీ తనను ఎంపిక చేసుకోవడం ఒక అద్భుతమైన క్షణమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా దేవుడికి, తల్లిదండ్రులకు, తన కోసం ప్రార్థించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచకప్ విజేతలతో కలిసి ఆడే ఛాన్స్

వచ్చే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్రపంచ స్థాయి క్రీడాకారిణులైన జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ వంటి స్టార్లు ఉన్నారు. ప్రపంచకప్‌లో మెరిసిన ఈ సార్లతో కలిసి ఆడే అవకాశం రావడం తన అదృష్టమని మిన్ను మణి పేర్కొన్నారు.

"ప్రపంచకప్ విజేతలైన జెమీమా, షఫాలీలతో కలిసి ఆడటం నాకు దక్కిన గొప్ప అవకాశం. వారి అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కేవలం వారు మాత్రమే కాదు, దక్షిణాఫ్రికాను ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లి, టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన లారా వోల్వార్డ్ కూడా ఢిల్లీ జట్టులో ఉన్నారు. గత సీజన్లలో నాతో కలిసి ఆడిన మారిజాన్ కాప్, అనబెల్ సదర్లాండ్ వంటి స్టార్లతో మళ్లీ కలవబోతున్నాను" అని ఆమె చెప్పారు.

33
భారత జట్టు ఎంపిక, క్రికెట్ భవిష్యత్తు పై మిన్ను మణి కామెంట్స్

ఈసారి వేలంలో ఎక్కువ మంది కేరళ క్రీడాకారిణులకు అవకాశం దక్కకపోవడంపై మిన్ను మణి నిరాశ వ్యక్తం చేసినా, తన తోటి క్రీడాకారిణులైన ఆశా శోభన, సజన సజీవన్‌లకు మంచి ధర దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు.

"మరికొంత మంది మలయాళీ ప్లేయర్లు ఎంపికై ఉంటే బాగుండేది. కానీ వేలం అనేది మనం ముందుగా ఊహించలేము. నా విషయమే చివరి నిమిషంలో ఖరారైంది. ఒక ప్లేయర్ జట్టులో చేరాలంటే అనేక అంశాలు కలిసి రావాలి, అందులో అదృష్టం కూడా ఒక భాగమే. ఎవరు వెళ్తారు, ఎవరు మిగిలిపోతారు అనేది ముందుగా చెప్పలేము. అయితే, గత వేలంలో తక్కువ ధరకు అమ్ముడైన ఆశా అక్క, సజన అక్క ఈసారి మంచి ప్రైస్ కు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది" అని ఆమె పేర్కొన్నారు.

మహిళల వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం ఆశించినప్పటికీ, ఎంపిక కాకపోవడం పట్ల తనకు నిరాశ లేదని మిన్ను మణి స్పష్టం చేశారు. "కష్టపడి ఆడటం మాత్రమే మన చేతిలో ఉంది. ఎంపిక మన చేతుల్లో లేదు. అయితే టీమ్ సెలెక్షన్‌కు నా పేరు పరిగణనలోకి వచ్చిందని తెలియడమే సంతోషం. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరగనున్నాయి. ఆ సిరీస్‌లో సొంత గడ్డపై ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కేరళలో మహిళల క్రికెట్ లీగ్

పురుషుల కోసం కేరళ క్రికెట్ లీగ్ (KCL) ప్రారంభించినట్లే, మహిళల కోసం కూడా లీగ్ ప్రారంభమవుతుందని మిన్ను మణి ఆశిస్తున్నారు. గత కేరళ క్రికెట్ లీగ్‌లో మహిళలు ఒక ప్రదర్శన మ్యాచ్ ఆడారని గుర్తు చేశారు. రాబోయే ఒకటి రెండేళ్లలో కేరళలో మహిళల టి20 లీగ్ ప్రారంభమవుతుందని, అలాగే డబ్ల్యూపీఎల్ చైర్మన్‌గా జయేశ్ జార్జ్ ఉండటం వల్ల కేరళ మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆమె ఆకాంక్షించారు.

Read more Photos on
click me!

Recommended Stories