Lionel Messi : కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ పర్యటనలో గందరగోళం జరిగింది. కేవలం 10 నిమిషాలే మెస్సీ కనిపించడంతో అభిమానులు ఆగ్రహించి కుర్చీలు విసిరేశారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రాక కోసం కోల్‌కతా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనలు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మెస్సీని చూడటానికి వచ్చిన అభిమానులు, నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలో గందరగోళం సృష్టించారు.
నెలల తరబడి తమ అభిమాన ఆటగాడిని చూడాలని ఆశపడ్డ అభిమానులు, చివరకు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. మెస్సీ బిజీ షెడ్యూల్ కారణంగా స్టేడియంలో కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే గడిపి వెళ్లిపోయారు. దీంతో స్టేడియంలోని వేలాది మంది అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పడంతో కుర్చీలు, బాటిళ్లను మైదానంలోకి విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు.
26
ఇది మాకు ద్రోహం, డబ్బులు వాపస్ ఇవ్వండి: మెస్సీ ఈవెంట్‌పై అభిమానుల ఆవేదన
స్టేడియంలో జరిగిన అసలు విషయాన్ని ఒక అభిమాని వివరిస్తూ తమ ఆవేదనను వెల్లడించారు. "ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. లియోనెల్ మెస్సీ కేవలం 10 నిమిషాల పాటే అక్కడికి వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే మంత్రులు, నాయకులు ఆయనను చుట్టుముట్టారు. దీంతో సామాన్య అభిమానులమైన మాకు ఆయన సరిగా కనిపించలేదు" అని వాపోయారు.
అంతేకాకుండా, "మెస్సీ కనీసం ఒక్క కిక్ కొట్టలేదు, పెనాల్టీ షాట్ కూడా చేయలేదు. కేవలం వచ్చి, 10 నిమిషాల్లోనే వెళ్లిపోయారు. మేము పెట్టిన డబ్బు, మా ఎమోషన్స్, మా సమయం అంతా వృథా అయ్యింది. మేము ఏమీ చూడలేకపోయాము" అని సదరు అభిమాని తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
36
ఇది పెద్ద మోసం.. అభిమానులు ఫైర్
మరొక అభిమాని మాట్లాడుతూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ తీరును ఎండగట్టారు. "అక్కడ జరిగిన గందరగోళం చూస్తుంటే నిర్వాహకుల, అధికారుల ఏర్పాట్ల వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడికి వచ్చిన వారంతా ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తారు. అందరూ మెస్సీని చూడాలని వచ్చారు, కానీ మాకు ద్రోహం జరిగింది" అని అన్నారు.
"మాకు మా డబ్బులు తిరిగి కావాలి. మేనేజ్‌మెంట్ చాలా దారుణంగా ఉంది. కోల్‌కతా ఫుట్‌బాల్‌కు పెట్టింది పేరు, ఇది పూర్తిగా ఒక మోసం. మంత్రులు తమ పిల్లలతో అక్కడ ఎంజాయ్ చేశారు, కానీ మిగిలిన వారికి ఏమీ కనిపించలేదు. మాకు చాలా బాధగా ఉంది" అని సదరు అభిమాని కన్నీరు పెట్టుకున్నారు.
ఈవెంట్ కోసం భారీగా ఖర్చు చేసినా, తమ ఐకాన్‌ను సరిగా చూడలేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. "ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిన తర్వాత కూడా, మేము మెస్సీని ఒక్కసారి కూడా సరిగా చూడలేకపోవడం చాలా నిరాశ కలిగించింది. ఆయన కేవలం రెండు, మూడు సార్లు చేతులు ఊపారు, అంతే సంగతి" అని ఒక అభిమాని తెలిపారు.
"మెస్సీ ఈ ఈవెంట్‌కు వచ్చారు, కానీ మనం ఆయనకు ఎలాంటి సందేశం ఇచ్చాం? షారుఖ్ ఖాన్ వచ్చారో లేదో కూడా నాకు తెలియదు. ఈ మొత్తం వ్యవహారం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు, ప్రభుత్వానికి చాలా అవమానకరమైన విషయం. కోల్‌కతా చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే" అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
56
స్టేడియంలో విధ్వంసం
మెస్సీ వెళ్ళిపోవడంతో సహనం కోల్పోయిన అభిమానులు స్టేడియంలో వీరంగం సృష్టించారు. నిర్వాహకుల తీరుపై నినాదాలు చేస్తూ, చేతికి దొరికిన కుర్చీలను, వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అభిమానుల ఆవేదన కట్టలు తెంచుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
66
క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ
ఈ మొత్తం వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈవెంట్‌లో జరిగిన తప్పులపై ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
మమతా బెనర్జీ తన 'ఎక్స్'ఖాతాలో పోస్ట్ చేస్తూ, "ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినది చూసి నేను చాలా బాధపడ్డాను, ఆశ్చర్యపోయాను. వేలాది మంది క్రీడాభిమానులతో కలిసి ఈవెంట్‌లో పాల్గొనడానికి నేను కూడా స్టేడియానికి వెళ్తున్నాను. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని చూడాలని అభిమానులు వచ్చారు. ఈ దురదృష్టకర సంఘటనకు నేను లియోనెల్ మెస్సీకి, అలాగే ఆయన అభిమానులకు, క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని పేర్కొన్నారు.