IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?

Published : Dec 13, 2025, 04:09 PM IST

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈ వేలంలో ఆర్టీఎమ్ (RTM) కార్డ్ నిబంధన, యాక్సిలరేటెడ్ ప్రాసెస్, షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
ఐపీఎల్ 2026 మినీ వేలం: పూర్తి వివరాలు, నిబంధనలు

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా ఐపీఎల్ (TATA IPL) 2026 సీజన్ ప్లేయర్ వేలానికి రంగం సిద్ధమైంది. ఈసారి జరగబోయేది మెగా వేలం కాదు, మినీ వేలం. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ వేలం పాట జరగనుంది.

మధ్యాహ్నం 1:00 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీఎమ్ (RTM) కార్డ్ నిబంధన, వేలం ప్రక్రియ, ఆటగాళ్ల జాబితా ఆసక్తిని పెంచుతున్నాయి.

27
ఐపీఎల్ 2026 వేలం ముఖ్యాంశాలు, ఆటగాళ్ల జాబితా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2026 వేలం కోసం మొత్తం 1390 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. తుది జాబితాను 350 మందికి కుదించారు. ఇందులో 240 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా, 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి మొత్తం 77 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 స్థానాలు విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు. ముఖ్యంగా, అత్యధిక రిజర్వ్ ధర అయిన రూ. 2 కోట్ల విభాగంలో 40 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

37
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?

ఐపీఎల్ వేలంలో తరచుగా వినిపించే పదం 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డ్. అయితే, ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఫ్రాంచైజీలకు ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించే అవకాశం లేదు. నియమాల ప్రకారం, జట్లు తాము విడుదల చేసిన ఆటగాడిని మళ్లీ దక్కించుకోవడానికి ఈ కార్డును కేవలం మెగా వేలంలోనే ఉపయోగించగలవు. మినీ వేలంలో ఈ వెసులుబాటు ఉండదు.

ఆర్టీఎమ్ కార్డ్ చరిత్రను పరిశీలిస్తే, దీనిని గతంలో ఐపీఎల్ 2014 మెగా వేలానికి ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2018 మెగా వేలంలో కూడా కొనసాగించారు కానీ 2022 సీజన్ ముందు దీనిని తొలగించారు. గతంలో మెగా వేలంపాటల్లో గరిష్ఠంగా మూడు ఆర్టీఎమ్ కార్డులను అనుమతించేవారు.

47
ఐపీఎల్ వేలంలో అసలు ఆర్టీఎమ్ ఎలా పనిచేస్తుంది?

ఆర్టీఎమ్ లేదా రైట్ టు మ్యాచ్ అనేది ఒక ఆసక్తికరమైన నిబంధన. ఒక ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు, ఫ్రాంచైజీలు సాధారణంగా బిడ్డింగ్ చేస్తాయి. బిడ్డింగ్ ముగిసి, అత్యధిక ధర నిర్ణయించిన తర్వాత, వేలం నిర్వాహకుడు ఆ ఆటగాడి పాత ఫ్రాంచైజీని సంప్రదిస్తారు. ఆ ఫ్రాంచైజీ గనక తమ ఆర్టీఎమ్ కార్డును ఉపయోగించడానికి అంగీకరిస్తే, అత్యధిక బిడ్ ధరకు ఆ ఆటగాడిని తిరిగి తమ సొంతం చేసుకోవచ్చు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆర్టీఎమ్ అనేది ధరకు తగ్గింపు ఇవ్వదు, కేవలం పాత ఆటగాడిని నిలుపుకునే అవకాశాన్ని ఇస్తుంది. మార్కెట్ విలువ ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది ఐపీఎల్ ఇందులో ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఆర్టీఎమ్ వాడిన తర్వాత, అత్యధిక బిడ్ వేసిన జట్టుకు మరోసారి బిడ్ పెంచే అవకాశం ఉంటుంది. ఆ పెంచిన ధరకు కూడా ఒప్పుకుంటేనే పాత జట్టు ఆ ఆటగాడిని దక్కించుకోగలుగుతుంది.

57
ఐపీఎల్ లో యాక్సిలరేటెడ్ వేలం అంటే ఏమిటి?

ఐపీఎల్ వేలంలో యాక్సిలరేటెడ్ ఆక్షన్ అనేది చివరి దశ. జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న తర్వాత, మిగిలిన ఖాళీలను వేగంగా భర్తీ చేయడానికి ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇది ప్రారంభమయ్యే ముందు, ఫ్రాంచైజీలు తాము ఆసక్తిగా ఉన్న అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాను సమర్పిస్తాయి. కేవలం ఆ పేర్లను మాత్రమే ఈ రౌండ్‌లో పిలుస్తారు.

ఈ దశలో బిడ్డింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఆటగాడి పేరు పిలిచిన వెంటనే బిడ్ రాకపోతే, వారిని అమ్ముడుపోని వారిగా ప్రకటిస్తారు. ఐపీఎల్ 2026 వేలంలో మొదటి 70 మంది ఆటగాళ్ల వేలం పూర్తయ్యాక ఈ యాక్సిలరేటెడ్ రౌండ్ మొదలవుతుంది. ఇది కేవలం సమయాన్ని ఆదా చేసే ప్రక్రియ మాత్రమే తప్ప, బేస్ ప్రైస్ లేదా ఇతర నిబంధనలలో ఎలాంటి మార్పు ఉండదు.

67
ఐపీఎల్ వేలం: ఆటగాళ్ళ గణాంకాలు, బేస్ ప్రైస్ వివరాలు

ఈసారి ఐపీఎల్ వేలంలో యువ ప్రతిభకు పెద్దపీట వేశారు. షార్ట్‌లిస్ట్ చేసిన 350 మందిలో 224 మంది అన్‌క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని) భారతీయ ఆటగాళ్లు ఉండటం విశేషం.

క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల వివరాలు:

• క్యాప్డ్ ఇండియన్స్: 16 మంది

• క్యాప్డ్ ఓవర్సీస్ (విదేశీ): 96 మంది

• అన్‌క్యాప్డ్ ఇండియన్స్: 224 మంది

• అన్‌క్యాప్డ్ ఓవర్సీస్: 14 మంది

77
ఐపీఎల్ వేలం 2026 బేస్ ప్రైస్ వారీగా ఆటగాళ్ల సంఖ్య

• రూ. 2 కోట్లు: 40 మంది

• రూ. 1.5 కోట్లు: 9 మంది

• రూ. 1.25 కోట్లు: 4 మంది

• రూ. 1 కోటి: 17 మంది

• రూ. 75 లక్షలు: 42 మంది

• రూ. 50 లక్షలు: 4 మంది

• రూ. 40 లక్షలు: 7 మంది

• రూ. 30 లక్షలు: 227 మంది

డిసెంబర్ 16న జరిగే ఈ వేలంలో ఏ జట్టు ఎవరిని దక్కించుకుంటుందో, ఏ ఆటగాడు అత్యధిక ధర పలుకుతాడో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories