Image Credit: TwitterG Krishnan
తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025ను భారత పురుషుల, మహిళల జట్టు అద్భుతంగా ప్రారంభించాయి. ఈ టోర్నీలో ప్రారంభ మ్యాచ్ లో నేపాల్ తో తలపడిన భారత పరుషుల జట్లు అద్బుతంగా రాణించింది. అయితే, చివరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయాన్ని అందుకుంది.
జనవరి 14 మంగళవారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు కూడా అద్భుతంగా టోర్నీని ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్ లో దక్షిణ కొరియాపై ఘన విజయం సాధించింది.
మొదటి టర్న్‌లో, భారత జట్టు అటాక్ కు వెళ్లకుండా డిఫెండింగ్ కు దిగింది. ఇక్కడ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దక్షిణ కొరియా అటాకింగ్ ప్రారంభించినప్పటికీ, భారత డిఫెండింగ్ లో దృఢంగా నిలిచింది. భారత డిఫెండర్స్ తమ శాయశక్తులా ప్రయత్నించడంతో దక్షిణ కొరియా 10 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.
ఆ తర్వాత దక్షిణ కొరియా డిఫెండింగ్ కు ప్రతిస్పందనగా, భారత జట్టు పూర్తి స్థాయిలో అటాకింగ్ చేసి 94 పాయింట్లు సాధించి భారీ పాయింట్ల తేడాతో మొదటి ఇన్నింగ్స్‌ను గెలుచుకుంది. ప్రియాంక ఇంగోల్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణ కొరియాకు చెందిన 15 మంది డిఫెండర్స్ ను ఔట్ చేసింది.
India-women-Kho-Kho-World-Cup
మూడవ టర్న్‌లో, రెండవ ఇన్నింగ్స్ ప్రారంభంలో దక్షిణ కొరియా తిరిగి అటాక్ కు దిగింది. కానీ భారత జట్టు అద్భుతమైన డిఫెండింగ్ ను అధిగమించలేకపోయింది. వారు కేవలం ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించి, రెండు టర్న్‌లలో కలిపి 18 పాయింట్లు మాత్రమే సాధించారు.
నాలుగవ టర్న్‌లో, భారత జట్టు పూర్తిగా దాడి మోడ్‌లోకి వెళ్లి 100 పాయింట్ల మార్కును చేరుకుంది. రెండు టర్న్‌లలో కలిపి 175 పాయింట్లు సాధించింది. దీంతో భారత జట్టు తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇది భారీ విజయం.
Kho Kho World Cup, Kho Kho World Cup 2025, Kho Kho
దక్షిణ కొరియాపై ఈ ఘన విజయంతో టోర్నమెంట్‌లో తమ ప్రారంభ మ్యాచ్‌లో నేపాల్‌ను 42-37తో ఓడించిన పురుషుల జట్టుతో పోలిస్తే భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత పురుషుల ఖోఖో జట్టు స్వల్ప తేడాతోనే నేపాల్ పై విజయం సాధించింది.
అయితే, భారత మహిళల జట్టు ప్రదర్శన అద్భుతం అని చెప్పాలి. మెగా టోర్నీలో తన మొదటి మ్యాచ్ లోనే భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు గ్రూప్ Aలో 161 పాయింట్ల భారీ తేడాతో అగ్రస్థానంలో నిలిచింది.
అంతకుముందు, మహిళల లీగ్ దశలోని గ్రూప్ Bలో ఇంగ్లాండ్, ఉగాండా, కెన్యా జట్లు కూడా ఖోఖో టోర్నమెంట్ లో విజయంతో తమ ప్రచారాన్ని సరైన దిశలో ప్రారంభించాయి. ఈ టీమ్స్ ఒక్కొక్క విజయాన్ని సాధించాయి. గ్రూప్ Cలో నేపాల్ రెండు విజయాలు, నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
బంగ్లాదేశ్ టోర్నమెంట్‌లో తమ ప్రారంభ మ్యాచ్‌ను గెలుచుకుంది. గ్రూప్ Dలో దక్షిణాఫ్రికా రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో తమ ప్రచారాన్ని ప్రారంభించింది. పోలాండ్ ఇండోనేషియాపై రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. భారత మహిళల జట్టు బుధవారం, జనవరి 15న ఇరాన్‌తో తలపడనుంది.