
రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. భవిష్యత్ లో ఇతడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలే రారాజు అవుతాడని అంటున్నారు. ఈ ఐపిఎల్ సూర్యవంశీ జీవితాన్ని మలుపు తిప్పింది... టాప్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తూ స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ టీం ప్రస్తుతం అద్భుత విజయాలు అందుకుంటోంది అంటే ఈ 15 ఏళ్ల బుడ్డోడి వల్లే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
2025లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి సూర్యవంశీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు... కొడుతూనే ఉన్నాడు. అతి పిన్న వయసులో టీ20 సెంచరీ... ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్... వేగంగా 500 ఐపీఎల్ పరుగులు పూర్తిచేసిన ఆటగాడు... 1000 టీ20 పరుగులు పూర్తిచేసిన ఆటగాడు... ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్... ఇలా ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించాడు సూర్యవంశీ.
తాజాగా బలమైన పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తనదైన స్టైల్లో మెరుపులు మెరిపించాడు.. కేవలం 16 బంతుల్లోననే 43 పరుగులు చేశాడు వైభవ్. దీంతో ఈ సీజన్‌లో 400 పరుగుల మార్కును అందుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి టీనేజ్ ప్లేయర్ ఇతడే. ప్రస్తుత ఫామ్ కొనసాగిస్తే ఈ సీజన్‌లో మరో ఐదు భారీ మైలురాళ్లను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే 400 పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు ఒకే ఎడిషన్‌లో అన్‌క్యాప్డ్ బ్యాటర్‌గా అత్యధిక పరుగుల రికార్డుపై కన్నేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఈ రికార్డును కలిగి ఉన్నాడు. అతను 2023లో 625 పరుగులు చేశాడు. జైస్వాల్ రికార్డును బద్దలు కొట్టడానికి వైభవ్‌కు ఇంకా 225 పరుగులు అవసరం. మిగిలిన మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 9 మ్యాచ్‌లలో 400 పరుగులు చేసిన సూర్యవంశీ, ఈ రికార్డును బద్దలు కొట్టేలాగే కనిపిస్తున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే 37 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో ఏ బ్యాటర్ కూడా 30 సిక్సర్ల మార్కును దాటలేదు. ఇది పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో బౌలర్లపై అతని ఆధిపత్యాన్ని చూపిస్తుంది. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును కలిగి ఉన్నాడు. అతను 2012 ఎడిషన్‌లో 59 సిక్సర్లు కొట్టాడు. గేల్, ఆండ్రీ రస్సెల్ మాత్రమే ఒకే సీజన్‌లో 50కి పైగా సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లలోనే 37 సిక్సర్లు కొట్టాడు సూర్యవంశీ... అంటే ప్రతి గేమ్‌కు సగటున 4 సిక్సర్లకు పైగా కొడుతున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే క్రిస్ గేల్, పొలార్డ్ రికార్డును బద్దలుగొట్టే అవకాశం ఉంది.
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే బలమైన పోటీదారులలో ఒకడిగా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 400 పరుగుల మార్కును దాటిన ఈ టీనేజ్ సంచలనం చారిత్రక ఘనతను సాధించే దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుత CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అతను 24 ఏళ్ల వయసులో IPL 2021లో 635 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల సూర్యవంశీ, తన ఫామ్‌ను కొనసాగిస్తే గైక్వాడ్‌ను అధిగమించి, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలవగలడు.
ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ చేసిన 400 పరుగులలో 37 సిక్సర్లు, 34 ఫోర్ల ద్వారానే 358 పరుగులు సాధించాడు. అంటే అతని మొత్తం పరుగులలో దాదాపు 89.5% బౌండరీల ద్వారానే వచ్చాయి. ఇది అతని దూకుడైన బ్యాటింగ్ శైలిని చూపిస్తుంది. ఒకే ఐపీఎల్ సీజన్‌లో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన రికార్డు జోస్ బట్లర్ పేరిట ఉంది. అతను IPL 2022లో 863 పరుగులలో 582 పరుగులు (83 ఫోర్లు, 45 సిక్సర్లు) బౌండరీల ద్వారానే సాధించాడు. అంటే బట్లర్ మొత్తం పరుగులలో 67.4% బౌండరీల నుంచే వచ్చాయి. బట్లర్ రికార్డును అధిగమించాలంటే, సూర్యవంశీ కనీసం మరో 223 బౌండరీ పరుగులు చేయాల్సి ఉంటుంది.
టీ20 క్రికెట్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 99 సిక్సర్లు కొట్టాడు. వీటిలో 61 ఐపీఎల్‌లోనే వచ్చాయి. ఇప్పుడు రికార్డు సమయంలో 100 టీ20 సిక్సర్ల మైలురాయికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో వేగంగా 100 సిక్సర్లు కొట్టిన రికార్డు మాజీ ముంబై ఇండియన్స్ ఆల్-రౌండర్ కిరన్ పొలార్డ్ పేరిట ఉంది. అతను 843 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. సూర్యవంశీ కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లు కొట్టాడు. దీంతో పొలార్డ్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా 100 టీ20 సిక్సర్లు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలవబోతున్నాడు. ఇది ప్రపంచ క్రికెట్‌లో అతని ఎదుగుదలకు మరో నిదర్శనం.