SRH vs RCB : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. బెంగళూరులో గెలిచేది ఎవరు? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? గత రికార్డులు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
RCB vs SRH : డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరుకు హైదరాబాద్ షాక్ ఇస్తుందా?
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో తొలి పోరు మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ఈ పోరులో తలపడనున్నాయి. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో ఉండగా, గణాంకాల పరంగా హైదరాబాద్ జట్టే బలంగా కనిపిస్తోంది.
26
RCB vs SRH : హెడ్ టు హెడ్ రికార్డుల్లో హైదరాబాద్‌దే హవా
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌లు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఆర్సీబీ పై ఎస్‌ఆర్‌హెచ్ దే పైచేయిగా ఉంది. అయితే ప్రస్తుత ఫామ్, జట్టు కూర్పును బట్టి ఫలితం ఎలాగైనా ఉండవచ్చు.
36
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బలాబలాలు ఇవే
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్‌లో చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడీ ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారనుంది. గత సీజన్‌లో వీరిద్దరూ విధ్వంసకర ఆరంభాలను ఇచ్చారు.
వీరితో పాటు దేవదత్ పడిక్కల్ డొమెస్టిక్ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను ఈసారి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రోమారియో షెపర్డ్ వంటి భారీ హిట్టర్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ చేరికతో జట్టు మరింత సమతుల్యంగా మారింది.
బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ, ఆర్సీబీకి బౌలింగ్ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. జట్టు ప్రధాన పేసర్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఇది జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. హేజిల్‌వుడ్ లేని లోటును సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ భర్తీ చేయాల్సి ఉంటుంది.
భువీపై ఇప్పుడు పూర్తి బాధ్యత ఉంది. అలాగే యశ్ దయాల్ సేవలను కూడా ఆర్సీబీ ఈ సీజన్‌లో కోల్పోనుంది. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ ప్రదర్శన ఈ సీజన్‌లో ఆర్సీబీకి అత్యంత కీలకం కానుంది. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ షోపై జట్టు ఆశలు పెట్టుకుంది.
56
సన్‌రైజర్స్ హైదరాబాద్ కు తిరుగులేదు.. టాప్ ఆర్డరే ప్రధాన బలం
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తన టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అనే ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో, ఇషాన్ కిషన్ ప్రారంభ మ్యాచ్‌లకు జట్టును నడిపించే అవకాశం ఉంది. గత సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఫినిషర్‌గా అనికేత్ వర్మ గత ఏడాది తనదైన ముద్ర వేశాడు. ఈసారి నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టన్ వంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరూ రాణిస్తే హైదరాబాద్ భారీ స్కోర్లు సాధించడం ఖాయం.
66
ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ బలహీనతలు
బ్యాటింగ్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటు. పేస్ బౌలింగ్‌ను ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ నడిపించాల్సి ఉంటుంది. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ కీలకం కానున్నాడు. ఇక స్పిన్ విభాగంలో కూడా హైదరాబాద్‌కు పెద్ద పేరున్న ఆటగాళ్లు లేరు. యువ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఈ సీజన్‌లో తన ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. చిన్నస్వామి వంటి చిన్న స్టేడియంలో హైదరాబాద్ బౌలర్లు బెంగళూరు బ్యాటర్లను ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.