T20 World Cup 2026 : సింహం గర్జించింది.. వార్ వన్ సైడ్ ! భారత్ మళ్లీ కప్పు కొట్టింది !

Published : Mar 08, 2026, 10:59 PM IST

T20 World Cup 2026 : అహ్మదాబాద్‌ లో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది టీమిండియా. శాంసన్, అభిషేక్ మెరుపు హాఫ్ సెంచరీలకు తోడు బుమ్రా (4/15) అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ చరిత్ర సృష్టించింది.

PREV
15
టీ20 వరల్డ్ కప్ మనదే! కివీస్‌ను ఊచకోత కోసిన భారత్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అదిరిపోయే ఆటతో భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ గా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి టీమిండియా ఛాంపియన్‌గా అవతరించింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ఇదే గ్రౌండ్ లో భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

25
బ్యాటర్ల వీరవిహారం.. ముగ్గురు బ్యాటర్ల హాఫ్ సెంచరీలు

భారత ఇన్నింగ్స్‌లో టాప్-3 బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో మొదటి ముగ్గురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి భారత్ భారీ స్కోరుకు పునాది వేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి (21 బంతుల్లో 52 పరుగులు) కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. చివరలో శివం దూబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు (3 సిక్సర్లు, 2 ఫోర్లు) చేసి స్కోరును 250 దాటించాడు.

35
బుమ్రా బౌలింగ్ వినాశనం.. కివీస్ వెన్నులో వణుకు

భారత్ నిర్దేశించిన 256 పరుగుల కష్టతరమైన లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన స్లోయర్ బాల్స్‌తో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. బుమ్రా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర (1), మ్యాట్ హెన్రీ (0), జేమ్స్ నీషమ్ (8), మిచెల్ సాంట్నర్ (43)లను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు (40) తీసిన పేసర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

45
అక్షర్, అభిషేక్ స్పిన్ మ్యాజిక్.. పట్టుబిగించిన భారత్

పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా రాణించడంతో కివీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అక్షర్ పటేల్ తన 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫిన్ అలెన్ (9), గ్లెన్ ఫిలిప్స్ (5), డారిల్ మిచెల్ (17)లను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. వరుణ్ చక్రవర్తి ప్రమాదకరమైన టిమ్ సీఫెర్ట్ (52) వికెట్ తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. చివరి వికెట్‌ను అభిషేక్ శర్మ తీయడంతో భారత్ సంబరాలు మొదలయ్యాయి.

55
రికార్డుల సునామీ.. భారత్ ఖాతాలో అరుదైన ఘనతలు!

ఈ విజయంతో భారత్ అనేక రికార్డులను తిరగరాసింది. వాటిలో..

• అత్యధిక స్కోరు: ఫైనల్లో భారత్ చేసిన 255/5 స్కోరు, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మూడో అత్యధిక జట్టు స్కోరు.

• శాంసన్ రికార్డు: ఫైనల్లో శాంసన్ చేసిన 89 పరుగులు, టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

• బుమ్రా ఫీట్: టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో (4/15) అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

• సిక్సర్ల వర్షం: ఈ ఇన్నింగ్స్‌లో భారత్ మొత్తం 18 సిక్సర్లు బాది రికార్డు సృష్టించింది.

• విజయం : 96 పరుగుల తేడాతో విజయం అనేది టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటి.

ఈ విజయంతో టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పింది.

Read more Photos on
click me!

Recommended Stories