IND vs NZ: రోహిత్, కోహ్లీ ఉన్నా కెప్టెన్ ఆయనే ! హార్దిక్, బుమ్రాలకు నో ఛాన్స్

Published : Jan 02, 2026, 05:09 PM IST

India vs New Zealand : న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా ఎంపికపై కసరత్తు మొదలైంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు వర్క్ లోడ్ కారణంగా జట్టులో చోటుదక్కకపోవచ్చు.

PREV
16
రోహిత్, కోహ్లీ ఉన్నా కెప్టెన్ ఆయనే.. జట్టు ఎంపికలో ట్విస్ట్!

న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే సిరీస్ కోసం భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ కోసం టీమిండియాలో అనేక కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా జట్టు నాయకత్వ బాధ్యతలను యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తిరిగి చేపట్టనున్నాడు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి లభించే సూచనలు ఉన్నాయి.

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును జనవరి 3 లేదా 4వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అయితే ఆటగాళ్ల ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

26
శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ.. అయ్యర్ ఫిట్‌నెస్ సందేహం

గాయం కారణంగా ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, న్యూజిలాండ్ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నారు. టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు గిల్. ఆ తర్వాత టీ20 జట్టులో కూడా కనిపించాడు. దీంతో వన్డే జట్టు పగ్గాలు తిరిగి గిల్ చేతికే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కావడంతో అయ్యర్ క్రికెట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చికిత్స పొందుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, అయ్యర్‌కు ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు. దీంతో అతను న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

36
హార్దిక్, బుమ్రాలకు విశ్రాంతి ఎందుకు?

వరుస మ్యాచ్ లు, గత గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. రాబోయే టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో వీరిద్దరూ కీలక సభ్యులు కావడంతో, వారిని తాజాగా ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మాత్రం వీరిద్దరూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

46
ఓపెనింగ్, నంబర్ 4 లో ఆడేది ఎవరు?

శుభ్‌మన్ గిల్ రాకతో టాప్ ఆర్డర్ కూర్పుపై ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో గత సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ స్థానం ప్రమాదంలో పడింది. ఒకవేళ సెలెక్టర్లు యశస్విని పక్కన పెడితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేయవచ్చు. ఇషాన్ కిషన్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో రావడం ఖాయం. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కవచ్చు. దక్షిణాఫ్రికాపై ఇదే స్థానంలో రుతురాజ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ యధావిధిగా మిడిల్ ఆర్డర్‌లో కొనసాగే అవకాశం ఉంది.

56
పంత్ ఉంటాడా? వికెట్ కీపింగ్ రేసులో ఎవరున్నారు?

స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ జట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అనే దానిపై చర్చ నడుస్తోంది. 2024 జూలైలో శ్రీలంక పర్యటన తర్వాత పంత్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతని ప్రదర్శన అంత గొప్పగా లేదు. నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక అర్ధసెంచరీతో 121 పరుగులు మాత్రమే చేశారు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.

66
బౌలింగ్ విభాగంలో మార్పులు.. భారత జట్టు ఇదే

హార్దిక్ పాండ్యా లేకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కవచ్చు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లేదా అర్షదీప్ సింగ్‌ స్థానంలో రావచ్చు. హర్షిత్ రాణా జట్టులో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

అందరి దృష్టి ఇప్పుడు సీనియన్ పేసర్ మహ్మద్ షమీపై కూడా ఉంది. 35 ఏళ్ల షమీ విజయ్ హజారే ట్రోఫీలో 4 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా, హార్దిక్ లేని సమయంలో షమీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తే అతనికి పిలుపు రావచ్చు.

భారత జట్టులో ఎవరెవరుంటారు?

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్/సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్/ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్/మహ్మద్ షమీ.

Read more Photos on
click me!

Recommended Stories