T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !

Published : Dec 20, 2025, 03:04 PM IST

India T20 World Cup 2026 Squad: టీ20 ప్రపంచకప్‌, న్యూజిలాండ్ సిరీస్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్ పై వేటు పడగా, ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇచ్చాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంటారు.

PREV
16
టీమిండియాలో భారీ మార్పులు: ఇషాన్ ఈజ్ బ్యాక్, గిల్ అవుట్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీ ప్రారంభానికి 49 రోజుల ముందే బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం నుండి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఈ జట్టును వెల్లడించారు. ఈ ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కకపోవడం. గిల్ స్థానంలో అక్షర్ పటేల్‌ను భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు.

మరోవైపు, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చారు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా ఇదే జట్టు ఆడనుందని బీసీసీఐ స్పష్టం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది.

26
శుభ్‌మన్ గిల్‌కు దక్కని చోటు

భారత టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను టీ20 ఫార్మాట్ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా టీ20 సిరీస్ వరకు గిల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, లక్నోలో జరగాల్సిన మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ కాలికి గాయమైంది. దీని కారణంగా అతను ఆఫ్రికాతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

అయితే, కేవలం గాయం మాత్రమే గిల్ ఉద్వాసనకు కారణం కాదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది గిల్ టీ20లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 15 ఇన్నింగ్స్‌లలో కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ గానీ, సెంచరీ గానీ లేదు. అతని సగటు 24.25 కాగా, స్ట్రైక్ రేట్ 137.26గా నమోదైంది. ఈ పేలవ ఫామ్ కారణంగానే సెలెక్టర్లు గిల్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. గిల్‌తో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మకు కూడా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.

36
ఇషాన్ కిషన్, రింకూ సింగ్‌ల అదిరిపోయే రీఎంట్రీ

జట్టు ఎంపికలో శుభవార్త ఏమిటంటే ఇషాన్ కిషన్, రింకూ సింగ్‌ల పునరాగమనం. గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ అందించడమే కాకుండా, టోర్నీలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 500కు పైగా పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్లను మెప్పించి ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.

అలాగే, గతంలో జట్టు నుండి ఉద్వాసనకు గురైన రింకూ సింగ్‌కు కూడా మరో అవకాశం లభించింది. సంజూ శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్ రెండవ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. గిల్ లేకపోవడంతో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

46
భారత జట్టు కొత్త వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోవడంతో, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు పదోన్నతి లభించింది. అతన్ని టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. జట్టులో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఇతర ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు.

బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా పేస్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఇతర పేసర్లుగా ఎంపికయ్యారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి సత్తా చాటనున్నారు.

56
న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్ ఇదే

టీ20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే సిరీస్ జనవరి 11 నుండి 18 వరకు జరుగుతుంది. వన్డే జట్టును ఇంకా ప్రకటించలేదు.

ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన టీ20 జట్టే న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లోనూ ఆడుతుంది. ఈ సిరీస్ జనవరి 21 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది.

• మొదటి టీ20: జనవరి 21 (నాగపూర్)

• రెండవ టీ20: రాయ్‌పూర్

• మూడవ టీ20: జనవరి 25 (గౌహతి)

• నాలుగవ టీ20: జనవరి 28 (విశాఖపట్నం)

• ఐదవ టీ20: జనవరి 31 (తిరువనంతపురం)

ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ప్రపంచకప్ కోసం సిద్ధమవుతుంది.

66
టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి వివరాలు, భారత జట్టు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 20న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ గ్రూప్-Aలో ఉంది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026, న్యూజిలాండ్ సిరీస్‌ కోసం భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Read more Photos on
click me!

Recommended Stories