ఒక్క పరుగు టార్గెట్.. క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. సూపర్ ఓవర్‌లో భారత్ కు షాక్

Published : Nov 21, 2025, 08:20 PM IST

INDA vs BANA : సూపర్ ఓవర్‌లో భారత్ చిత్తుగా ఓడింది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో కేవలం ఒక్క పరుగు టార్గెట్ ను అందుకోలేకపోయింది. చివరి వరకూ ఉత్కంఠ రేపిన పోరులో విజయంతో బంగ్లాదేశ్-ఏ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

PREV
15
దోహా మైదానంలో ఉత్కంఠగా సాగిన రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్

క్రికెట్ చరిత్రలో అతి అరుదైన సంఘటనల్లో ఒకటి దోహా మైదానంలో చోటు చేసుకుంది. కేవలం ఒక్క పరుగు టార్గెట్ మ్యాచ్ జరిగింది. సూపర్ ఓవర్‌లో గెలవడానికి కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరం అయిన మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో చివరి క్షణాల్లో జరిగిన పొరపాట్లు భారత జట్టును టోర్నమెంట్ నుంచి అవుట్ చేశాయి. దీంతో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఫైనల్‌కు బంగ్లాదేశ్ దూసుకెళ్లింది.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 తొలి సెమీఫైనల్‌లో భారత్-ఏ జట్టు కలలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. చివరి బంతి వరకూ సాగిన ఉత్కంఠభరిత పోరాటం సూపర్ ఓవర్ వరకు వెళ్లినా, అక్కడ భారత బ్యాటర్ల దారుణ వైఫల్యంతో మ్యాచ్‌ను కోల్పోయింది.

25
బంగ్లాదేశ్ భారీ స్కోరు.. చివరి ఓవర్లలో పరుగుల వరద

ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, బంగ్లాదేశ్ బ్యాటర్లు చివరలో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. మొదటి 15 ఓవర్లలో నియంత్రణలో కనిపించిన భారత బౌలర్లు చివరి ఐదు ఓవర్లలోనే 75 పరుగులు ఇచ్చి ఒత్తిడికి గురయ్యారు.

ఓపెనర్ హబీబుర్ రెహమాన్ 65 పరుగులతో బంగ్లా ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. చివర్లో మెహ్రూబ్ హుస్సేన్ కేవలం 18 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేయడంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది.

నమన ధీర్ వేసిన 19వ ఓవర్‌లో 28 పరుగులు, వైశాఖ్ వేసిన చివరి ఓవర్‌లో మరో 22 పరుగులు రావడంతో బంగ్లాదేశ్ స్కోరు 194/6 చేరింది.

35
ధాటిగా భారత ఇన్నింగ్స్ ఆరంభం

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (44), వైభవ్ సూర్యవంశీ (38) అద్భుతమైన ఆరంభం అందించారు. వైభవ్ కేవలం 15 బంతుల్లో 38 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పినట్లు అనిపించింది.

నీహల్ వధేరా (32), జితేశ్ శర్మ (33) కూడా పోరాడినా మ్యాచ్ భారత్ వైపు రాలేదు. చివరి ఓవర్‌లో అశుతోష్ శర్మ సిక్సర్, బౌండరీతో ఆశలు పెంచాడు. చివరి బంతికి హర్ష్ దూబే మూడు పరుగులు సాధించడంతో మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా టై అయింది. దీంతో సూపర్ ఓవర్ కు చేరింది.

45
సూపర్ ఓవర్ లో రెండు బంతుల్లోనే ఆలౌట్ అయిన భారత్

సూపర్ ఓవర్‌లో భారత తరఫున జితేశ్ శర్మ, రమణ్ దీప్ సింగ్ క్రీజులోకి వచ్చారు. అయితే బంగ్లాదేశ్ పేసర్ రిప్పన్ మొండల్ వేసిన తొలి రెండు బంతులే భారత గేమ్‌ను ముగించాయి. 1వ బంతి యార్కర్‌ వేయడంతో జితేశ్ శర్మ బౌల్డ్ అయ్యాడు. 2వ బంతికి అశుతోష్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ఒక్క పరుగు కూడా చేయలేక సూపర్ ఓవర్‌ను సున్నా పరుగులతో ముగించింది.

55
బంగ్లాదేశ్‌-ఏ చరిత్రాత్మక ఫైనల్‌ ఎంట్రీ

సుయాష్ శర్మ తొలి బంతికే యాసిర్ అలీని క్యాచ్‌గా పెవిలియన్ కు పంపాడు. అయితే, రెండో బంతి వైడ్ అవడంతో బంగ్లాదేశ్ అవసరమైన ఒక్క పరుగు రావడంతో విజయం అందుకుంది. దీంతో వారు తొలిసారి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరిన ఘనత సాధించారు. ఒక్క పరుగు టార్గెట్ ఉండటం ఇది క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories