IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 51 పరుగుల తేడాతో ఓడింది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. సంజూ శాంసన్ పక్కన పెట్టి గిల్ ను జట్టులోకి తీసుకుంటే వరుస వైఫల్యాలతో టీమిండియాకు భారంగా మారాడు.
IND vs SA: వైస్ కెప్టెన్‌పై అభిమానుల ఆగ్రహం.. కారణం ఇదే!
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా తలపడుతోంది. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది.
కేవలం ఓటమి మాత్రమే కాకుండా, జట్టులోని కీలక ఆటగాడి పేలవ ఫామ్ ఇప్పుడు మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అతనెవరో కాదు, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్. అవకాశాలు వస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గిల్ విఫలమవుతున్నాడు. టీమిండియాకు భారంగా మారుతున్నాడు.
26
సిరీస్‌లో దక్షిణాఫ్రికా సమం
ముల్లన్ పూర్ లో గురువారం జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పర్యాటక జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 213/4 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ను అందుకునే క్రమంలో భారత్ 162 పరుగులకే ఆలౌట్ అయింది.
తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో సఫారీలు పైచేయి సాధించారు. దీంతో సిరీస్ ఉత్కంఠభరితంగా మారింది.
ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ ఆదివారం, డిసెంబర్ 14న ధర్మశాలలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
36
భారత్‌కు సమస్యగా మారిన ఓపెనర్
భారత జట్టు ఓటమి కంటే ఎక్కువగా, స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. తన పేలవ బ్యాటింగ్‌తో గిల్ ఇప్పుడు విమర్శకులకు చిక్కాడు.
జట్టులో కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన వైస్ కెప్టెన్ ఇలా వరుసగా విఫలమవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతనికి సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తున్నా, గిల్ మాత్రం పరుగులు రాబట్టలేకపోతున్నాడు.
అతని బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం భారత టాపార్డర్‌ను బలహీనపరుస్తోంది. శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టీ20 ఫార్మాట్‌లో మాత్రం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.
రెండో మ్యాచ్‌లో గిల్ ప్రదర్శన అత్యంత నిరాశజనకంగా సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్‌మన్ గిల్, ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ బాట పట్టాడు.
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి వేసిన బంతిని అంచనా వేయడంలో గిల్ విఫలమయ్యాడు. దీంతో రెజా హెండ్రిక్స్ చేతికి చిక్కి ఖాతా తెరవకుండానే గోల్డెన్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు.
అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి వచ్చిన గిల్, జట్టుకు శుభారంభం ఇవ్వాల్సింది పోయి, తొలి బంతికే వికెట్ సమర్పించుకుని జట్టు పై ఒత్తిడి పెంచాడు.
56
గత 17 ఇన్నింగ్స్‌ల్లో గిల్ పేలవ ప్రదర్శన
గిల్ వైఫల్యం కేవలం ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. కటక్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో కూడా అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
గత గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. తన చివరి 17 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో శుభ్‌మన్ గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు.
ఈ 17 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను చేసిన మొత్తం పరుగులు కేవలం 349 మాత్రమే. ఒక ఓపెనర్‌గా, అందునా వైస్ కెప్టెన్‌గా ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ప్రదర్శన అని విశ్లేషకులు అంటున్నారు.
66
జట్టులో గిల్ చోటుపై నీలినీడలు
ప్రస్తుత ప్రదర్శనను బట్టి చూస్తే, భారత టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌లో శుభ్‌మన్ గిల్ చోటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ స్థానంలో సంజూ శాంసన్ అయితేనే న్యాయం చేయగలడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. గణాంకాల పరంగా చూసినా, టీ20 ఓపెనర్‌గా గిల్ కంటే సంజూ శాంసన్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది.
నిరంతర వైఫల్యాల తర్వాత కూడా గిల్ జట్టులో ఎంతకాలం కొనసాగుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధర్మశాలలో జరగబోయే తదుపరి మ్యాచ్‌లోనైనా గిల్ పుంజుకుంటాడా లేదా వేటు పడుతుందా అనేది వేచి చూడాలి.