
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. సఫారీలు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చేతులెత్తేసింది. ముల్లాన్‌పూర్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల పేలవ ప్రదర్శన కాగా, రెండోది ఛేదనలో టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమవ్వడం. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి దారితీసిన పూర్తి అంశాలు గమనిస్తే..
దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 213/4 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ భారీ లక్ష్యమే భారత్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా సఫారీ ఓపెనర్ క్వింటన్ డి కాక్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డి కాక్ కేవలం 46 బంతుల్లోనే 90 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశాడు.
అతనికి తోడుగా ఐడెన్ మార్క్రామ్, డోనోవన్ ఫెరీరా, డేవిడ్ మిల్లర్ కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరంతా దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా రన్ రేట్ ఏ దశలోనూ తగ్గలేదు. ఫలితంగా బోర్డుపై భారీ స్కోరు నమోదైంది. భారత బౌలింగ్ ప్రభావం చూపలేకపోయింది.
భారత బౌలర్లు నిలకడలేమితో సతమతమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు మన బౌలర్లు అవకాశమిచ్చారు.
భారత పేసర్ అర్షదీప్ సింగ్ లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయ్యాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా ఏడు వైడ్లు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ అదనపు పరుగులు దక్షిణాఫ్రికా స్కోరును మరింత పెంచాయి. అతను వేసిన ఆ ఓవర్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.
అనుభవజ్ఞులైన జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి బౌలర్లు కూడా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. పేస్ అటాక్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అక్షర్ పటేల్ ఆరంభంలో పర్వాలేదనిపించినా, చివర్లో పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి పర్వాలేదనిపించాడు.
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే తడబడింది. భారత ఇన్నింగ్స్ పట్టాలు తప్పడానికి టాపార్డర్ వైఫల్యమే ప్రధాన కారణం. కీలకమైన వికెట్లను ఆరంభంలోనే కోల్పోవడం టార్గెట్ ను అందుకోవడంలో కష్టంగా మారింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. ఇది జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
అలాగే, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సఫారీ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. పవర్ ప్లే ముగిసే సమయానికే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ గెలిచే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. హార్దిక్ పాండ్యా కూడా 23 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసి, స్ట్రైక్ రేట్ పెంచడంలో విఫలమయ్యాడు.
భారత ఇన్నింగ్స్‌లో ఏకైక సానుకూల అంశం తిలక్ వర్మ బ్యాటింగ్. వికెట్లు పడుతున్నా, తిలక్ వర్మ మొక్కవోని ధైర్యంతో పోరాడాడు. 34 బంతుల్లోనే 62 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయితే, అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు.
మిగిలిన బ్యాటర్లు కనీసం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తిలక్ వర్మ మినహా మరే బ్యాటర్ కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. చివరకు భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఈ మ్యాచ్‌లో ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. వైట్-బాల్ క్రికెట్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండదని, మ్యాచ్ పరిస్థితిని బట్టి బ్యాటర్లను పంపాలన్నది గంభీర్ ప్లాన్ గా కనిపించింది.
ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానానికి పంపడం పెద్ద ప్రయోగం. దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కోవడానికి లేదా రన్ రేట్ పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ప్రయోగం దారుణంగా విఫలమైంది. అక్షర్ పటేల్ 21 బంతుల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఇది ఇన్నింగ్స్ వేగాన్ని తగ్గించడమే కాకుండా, తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడిని పెంచింది. ఈ నిర్ణయం బ్యాక్ ఫైర్ అయ్యిందని కామెంటేటర్లు సైతం అభిప్రాయపడ్డారు. మొత్తానికి, బౌలర్ల పేలవ ప్రదర్శన, టాపార్డర్ కుప్పకూలడం, వ్యూహాత్మక తప్పిదాల కారణంగా రెండో టీ20లో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.