Kuldeep Yadav : రాజ్‌కోట్ వన్డేలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 82 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డే కెరీర్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇలా జరగడం ఇది రెండోసారి కావడంతో చెత్త రికార్డు నమోదైంది. కుల్దీప్ బౌలింగ్ కు ఏమైంది?
కుల్దీప్ మ్యాజిక్ ఫెయిల్.. ఆ ఇద్దరు బ్యాటర్ల ఊచకోత మామూలుగా లేదు!
సాధారణంగా మైదానంలో తన మణికట్టు మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. న్యూజిలాండ్ జట్టు ముందు మాత్రం తేలిపోయాడు. రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో కివీస్ బ్యాటర్లు కుల్దీప్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఫలితంగా టీమిండియా ఓటమి పాలవ్వడమే కాకుండా, సిరీస్ సమం అయ్యింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ తన వన్డే కెరీర్‌లోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
25
IND vs NZ : చరిత్రాత్మక విజయంతో సిరీస్ సమం
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, రెండో మ్యాచ్‌లో కివీస్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 284 పరుగుల భారీ స్కోరును సాధించింది. అయితే, ఈ లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ చాలా సునాయాసంగా ఛేదించింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే అత్యంత భారీ రన్ చేజ్ కావడం విశేషం. ఈ విజయంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.
35
కుల్దీప్ యాదవ్ కు షాక్
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పైనే పడింది. అయితే, కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్, విల్ యంగ్.. కుల్దీప్‌పై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. ఒత్తిడిని సృష్టించి అతడిని లయ తప్పేలా చేశారు. మిగిలిన జట్లపై తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే కుల్దీప్, ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. తన కోటా 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు ఇవ్వడం భారత ఓటమిని శాసించింది.
కుల్దీప్ యాదవ్ తన 119 వన్డేల కెరీర్‌లో ఒక ఇన్నింగ్స్‌లో (10 ఓవర్ల స్పెల్‌లో) 80కి పైగా పరుగులు ఇవ్వడం ఇది మూడోసారి మాత్రమే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో రెండు సార్లు ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ కావడం గమనార్హం. గతంలో 2020లో హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు కుల్దీప్ బౌలింగ్‌లో 84 పరుగులు రాబట్టారు.
అది కుల్దీప్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన స్పెల్. ఆ తర్వాత 2021లో పుణెలో ఇంగ్లండ్ పై కూడా వికెట్లేమీ తీయకుండా 84 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు రాజ్‌కోట్‌లో మరోసారి 82 పరుగులు ఇచ్చి తన కెరీర్‌లో మరో మాయని మచ్చను వేసుకున్నాడు.
వన్డే క్రికెట్ లో కుల్దీప్ యాదవ్ అత్యంత ఖరీదైన స్పెల్స్
84/2 - వర్సెస్ న్యూజిలాండ్, హామిల్టన్ (2020)
84/0 - వర్సెస్ ఇంగ్లండ్, పుణె (2021)
82/1 - వర్సెస్ న్యూజిలాండ్, రాజ్‌కోట్ (2026)
78/1 - వర్సెస్ దక్షిణాఫ్రికా, రాయ్‌పూర్ (2025)
55
డారిల్ మిచెల్, విల్ యంగ్ వీరవిహారం
రాజ్‌కోట్ వన్డేలో కుల్దీప్ యాదవ్ గణాంకాలను దెబ్బతీయడంలో డారిల్ మిచెల్ ప్రధాన పాత్ర పోషించాడు. నంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చిన విల్ యంగ్ కూడా భారత స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 152 బంతుల్లో 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
విల్ యంగ్ 87 పరుగుల వద్ద అవుటైనప్పటికీ, డారిల్ మిచెల్ మాత్రం చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. మిచెల్ 117 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌పై వన్డేల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.