
రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. బుధవారం (జనవరి 14) నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో పర్యాటక న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, కేఎల్ రాహుల్ (112 నాటౌట్) అద్భుత సెంచరీతో 284 పరుగులు చేసింది. అయితే, డారిల్ మిచెల్ (131 నాటౌట్), విల్ యంగ్ (87) అద్భుత బ్యాటింగ్ తో కివీస్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇప్పుడు సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 18న (ఆదివారం) ఇండోర్ లో జరగనుంది. వడోదరలో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.
285 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలో తడబడింది. హర్షిత్ రానా వేసిన బంతికి ఓపెనర్ డెవాన్ కాన్వే (16) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రీ నికోల్స్ (10) కూడా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ప్లేడ్ ఆన్ గా వెనుదిరిగాడు. దీంతో 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, విల్ యంగ్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. వీరిద్దరూ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో మిచెల్ కు లైఫ్ లభించడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. 36వ ఓవర్లో మిచెల్ (అప్పుడు 82 పరుగులు) ఇచ్చిన క్యాచ్ ను కుల్దీప్ వదిలేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మిచెల్, 96 బంతుల్లోనే తన 8వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది భారత్ పై అతనికి మూడో సెంచరీ కావడం విశేషం. మిచెల్, యంగ్ మూడో వికెట్ కు ఏకంగా 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విల్ యంగ్ 87 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్ లో ఔటైనప్పటికీ, మిచెల్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు.
అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభం అంత గొప్పగా లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ ఖాతా తెరవడానికి 11 బంతులు తీసుకున్నాడు. తొలి 6 ఓవర్లలో స్కోరు కేవలం 18 పరుగులు మాత్రమే. ఆ తర్వాత వేగం పెంచినా, రోహిత్ (24) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.
గిల్ 47 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నా, 56 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ (8), విరాట్ కోహ్లీ (23) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. కోహ్లీని క్లార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైంది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. మొదట జడేజాతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. జడేజా ఔటైన తర్వాత, యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి (20) తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 19 ఇన్నింగ్స్ ల తర్వాత రాహుల్ తన బ్యాట్ నుంచి సెంచరీ వచ్చింది.
కేవలం 87 బంతుల్లోనే రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన రాహుల్ 112 పరుగులు చేశాడు. అతని పోరాటం వల్లే భారత్ 284/7 అనే గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. కానీ బౌలర్ల వైఫల్యం కారణంగా ఈ స్కోరును భారత్ కాపాడుకోలేకపోయింది.
భారత బౌలింగ్ విభాగం రాజ్ కోట్ లో పూర్తిగా నిరాశపరిచింది. హర్షిత్ రానా, ప్రసిద్ధ్ కృష్ణ ఆరంభంలో వికెట్లు తీసినప్పటికీ, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన 36వ ఓవర్లో మిచెల్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను వదిలేయడం భారత్ కొంపముంచింది.
అప్పటికి మిచెల్ 82 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ ఒక్క తప్పు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచలేకపోయారు. దీంతో 47.3 ఓవర్లలోనే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేధించింది.
రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్ కు రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఇక్కడ ఆడిన మొత్తం 5 మ్యాచ్ లలో భారత్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఏకంగా 4 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. 2013లో ఇంగ్లాండ్, 2015లో సౌత్ ఆఫ్రికా, 2023లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇక్కడ ఓడిపోయింది. కేవలం 2020లో ఆస్ట్రేలియాపై మాత్రమే గెలిచింది. ఇప్పుడు 2026లో న్యూజిలాండ్ చేతిలో కూడా ఓటమి తప్పలేదు.
సిరీస్ లో చెరో మ్యాచ్ గెలవడంతో, ఇండోర్ లో జరిగే మూడో వన్డే ఫైనల్ లాంటిది కానుంది. జనవరి 18న జరిగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే సిరీస్ వారి సొంతమవుతుంది.