T20 World Cup 2026 : భద్రతా కారణాల సాకుతో టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ బోర్డు కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోనుంది. ఇంకా ఎలాంటి నష్టం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియాలో ఆడమంటే కుదరదన్నారు.. ఇప్పుడు వరల్డ్ కప్ నుంచే అవుట్
బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను అధికారికంగా తప్పిస్తున్నట్లు ప్రకటించింది. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలో చేర్చుతున్నట్లు ఐసీసీ శనివారం స్పష్టం చేసింది. భారత్‌లో జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించడం, గడువులోగా నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఐసీసీ ఈ కఠిన చర్యలు తీసుకుంది.
26
భద్రతా కారణాలు.. ఐసీసీ ఏం చెప్పంది?
టీ20 ప్రపంచ కప్ 2026 భారత్, శ్రీలంకలలో జరగనుంది. అయితే, భారత్‌లో తమ జట్టుకు భద్రతా పరమైన ముప్పు ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. కానీ, ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించింది.
స్వతంత్ర భద్రతా సంస్థల ద్వారా నిర్వహించిన అసెస్‌మెంట్‌లో బంగ్లాదేశ్ జట్టుకు, అధికారులకు లేదా అభిమానులకు భారత్‌లో ఎటువంటి ప్రమాదకరమైన ముప్పు లేదని తేలింది. ఈ విషయాన్ని ఐసీసీ స్పష్టంగా పేర్కొంది. దీనిపై చర్చించేందుకు బీసీబీకి 24 గంటల గడువు ఇచ్చినప్పటికీ, వారు తుది నిర్ణయాన్ని వెల్లడించలేకపోయారు. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేయాల్సి వచ్చింది.
36
బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ
బంగ్లాదేశ్ అవుట్ కావడంతో ఆ బెర్తును స్కాట్లాండ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకిల్స్‌లో 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్, ఇప్పుడు గ్రూప్-Cలో బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం స్కాట్లాండ్ ఇప్పుడు సిద్ధమవుతోంది. టోర్నీకి అతి తక్కువ సమయం ఉండటంతో షెడ్యూల్‌లో మార్పులు చేయడం సాధ్యం కాదని, ప్రచురించిన ఈవెంట్ షెడ్యూల్‌ను మార్చడం సముచితం కాదని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ పరిణామంపై ఐసీసీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఐసీసీ నిర్వహించిన భద్రతా అంచనాల ప్రకారం, భారత్‌లో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఎటువంటి విశ్వసనీయమైన లేదా ధృవీకరించదగిన భద్రతా ముప్పు లేదు. ఈ ఫలితాల వెలుగులో, విస్తృతమైన చిక్కులను పరిగణనలోకి తీసుకుని, ఈవెంట్ షెడ్యూల్‌ను సవరించడం సరైనది కాదని ఐసీసీ నిర్ణయించింది" అని తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి విషయం రాకపోవడంతో, స్కాట్లాండ్‌తో భర్తీ చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు గవర్నింగ్ బాడీ వివరించింది.
56
బంగ్లా బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం
టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. కేవలం టోర్నీలో పాల్గొనకపోవడం వల్ల వచ్చే నష్టం మాత్రమే కాదు, ఐసీసీ నుంచి వచ్చే ఆదాయంలో కూడా భారీ కోత పడనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు ఐసీసీ సుమారు 5,00,000 డాలర్ల ఫీజును అందిస్తుంది. బంగ్లాదేశ్ ఈ మొత్తాన్ని తక్షణమే కోల్పోతుంది.
అసలైన దెబ్బ ఐసీసీ వార్షిక ఆదాయ వాటా రూపంలో తగలనుంది. ఇది సుమారు 27 మిలియన్ డాలర్లు (బంగ్లాదేశ్ కరెన్సీలో 330 కోట్లు) ఉంటుంది. బీసీబీ వార్షిక బడ్జెట్‌లో ఇది దాదాపు 60 శాతానికి సమానం. ఈ నిధులు ఆగిపోతే బోర్డు కార్యకలాపాలకు తీవ్ర నష్టం కలుగుతుంది.
66
స్పాన్సర్‌షిప్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రభావం
వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలలో పాల్గొనకపోవడం వల్ల బీసీబీకి స్పాన్సర్‌షిప్ ఆదాయం కూడా నిలిచిపోతుంది. అంతర్జాతీయంగా జట్టు కనిపించకపోతే స్పాన్సర్లు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, భారత్ బంగ్లాదేశ్‌లో పర్యటించి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం తక్కువగా ఉంది. భారత్‌తో ఒక్క సిరీస్ ఆడకపోవడం వల్ల వచ్చే నష్టం, ఇతర దేశాలతో పది సిరీస్‌లు నిర్వహించడం వల్ల వచ్చే ఆదాయంతో సమానమని పీటీఐ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు బీసీబీకి ఉన్న ఏకైక మార్గం లాసాన్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ ను ఆశ్రయించడం. అయితే, న్యాయ పోరాటం చేసినప్పటికీ, వరల్డ్ కప్ బంగ్లాదేశ్ లేకుండానే జరుగుతుందని, ఆర్థిక నష్టం మాత్రం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.