IPL 2026 : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేలంలో రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ 2026 ఆడతాడా? లేదా?
IPL 2026 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ !
ఐపీఎల్ (IPL) 2026 సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీ భారీ అంచనాలతో, ఏకంగా రూ. 14.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటగాడు అకస్మాత్తుగా గాయపడ్డారు.
దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ ఆడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. ఈ పరిణామం చెన్నై జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
26
రంజీ మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ ఎలా గాయపడ్డారు?
చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత ఖరీదైన అన్-క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్.. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో గాయపడ్డారు. మ్యాచ్ మొదటి రోజు లంచ్ విరామానికి సరిగ్గా ముందు ఫీల్డింగ్ చేస్తుండగా ప్రశాంత్ వీర్ భుజానికి గాయమైంది.
గాయం తీవ్రత కారణంగా అతను మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రశాంత్ వీర్ స్థానంలో సీరియస్ ఇంజురీ రీప్లేస్‌మెంట్ నిబంధన ప్రకారం ఎడమచేతి వాటం స్పిన్నర్ శివమ్ శర్మను ఉత్తర ప్రదేశ్ జట్టులోకి తీసుకున్నారు.
36
ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారా?
ప్రశాంత్ వీర్ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26న ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నందున, లీగ్ మొదలవడానికి కనీసం ఒక నెల ముందుగానే ప్రశాంత్ వీర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఆశిస్తోంది.
రూ. 14.2 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన ఈ ఆటగాడిపై జట్టు ఎంతో నమ్మకం పెట్టుకుంది. అయితే, ఈ మూడు వారాల విశ్రాంతి తర్వాత అతని ఫిట్‌నెస్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
దేశవాళీ క్రికెట్‌లో ఈ సీజన్ నుంచే సీరియస్ ఇంజురీ రీప్లేస్‌మెంట్ నిబంధనను అమలులోకి తెచ్చారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఈ నిబంధనను ఉపయోగించడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు అక్టోబర్ 2025లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా ఈ రూల్‌ను వాడారు. ఆ మ్యాచ్‌లో బెంగాల్ ఓపెనర్ సుదీప్ ఛటర్జీ గాయపడటంతో, అతని స్థానంలో కాజీ జునైద్ సైఫీ జట్టులోకి వచ్చారు. తద్వారా కొత్త నిబంధన ప్రకారం రంజీ ప్లేయింగ్ లెవెన్‌లో చేరిన మొదటి ఆటగాడిగా సైఫీ నిలిచారు. అంతకుముందు దులీప్ ట్రోఫీలో సౌరాష్ట్ర వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సౌరభ్ నవాలేను వెస్ట్ జోన్ జట్టులోకి తీసుకోవడం ద్వారా ఈ నిబంధనను తొలిసారిగా ప్రయోగించారు.
56
ప్రశాంత్ స్థానంలో వచ్చిన శివమ్ శర్మ ప్రదర్శన ఎలా ఉంది?
ప్రశాంత్ వీర్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన శివమ్ శర్మ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 18.5 ఓవర్లు బౌలింగ్ చేసిన శివమ్, 66 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టారు. ఇందులో జార్ఖండ్ తరఫున సెంచరీ బాదిన వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర వికెట్ కూడా ఉండటం విశేషం. కుశాగ్ర అవుట్ అయ్యే సమయానికి 102 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రశాంత్ లేని లోటును శివమ్ తన బౌలింగ్‌తో భర్తీ చేయడానికి ప్రయత్నించారు.
66
కష్టాల్లో ఉత్తర ప్రదేశ్
జార్ఖండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. 561/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జార్ఖండ్ బ్యాటర్లలో శరణ్‌దీప్ సింగ్ అత్యధికంగా 139 పరుగులు చేయగా, కుమార్ కుశాగ్ర 102 పరుగులతో సెంచరీ సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఉత్తర ప్రదేశ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఉత్తర ప్రదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రంజీ ట్రోఫీ నాకౌట్ రేసులో నిలిచేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఫలితం ఎంతో కీలకం కానుంది.