
అహ్మదాబాద్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ అభిమానులకు మస్తు వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. యువరాజ్ సింగ్ రికార్డుకు చేరువగా వచ్చి, కేవలం కొన్ని బంతుల తేడాతో మిస్ అయ్యాడు. కానీ యంగ్ సునామీ అభిషేక్ శర్మ రికార్డును మాత్రం హార్దిక్ బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పిచ్‌ను పరిశీలించి ముందుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని భావించాడు. టాస్ ఓడినా భారత్‌కు కోరుకున్న బ్యాటింగే దక్కింది.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాశం లభించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు శుభారంభాన్ని అందించింది. శాంసన్ ప్రోటీస్ జట్టు బౌలర్లపై విరుచుకుపడుతూ 37 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 34 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ కలిసి జట్టుకు బలమైన పునాది వేశారు.
ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించాడు. తిలక్ వర్మ కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్, 42 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
మరోవైపు హార్దిక్ పాండ్యా మైదానంలోకి అడుగుపెట్టడంతోనే స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించడం విశేషం. ఆ తర్వాత బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు. తిలక్ వర్మతో కలిసి నాలుగో వికెట్‌కు 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. హార్దిక్ పాండ్యా మొత్తం 25 బంతులు ఎదుర్కొని 63 పరుగులు చేశాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. హార్దిక్ ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఇదే ఏడాది ఇంగ్లాండ్‌పై అభిషేక్ శర్మ 17 బంతుల్లో చేసిన అర్ధశతకం రికార్డును హార్దిక్ పాండ్యా అధిగమించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అభిషేక్ ఆ ఫీట్ సాధించగా, ఇప్పుడు అహ్మదాబాద్ లో హార్దిక్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో హార్దిక్ కంటే వెనుకబడ్డాడు. రాహుల్, సూర్య ఇద్దరూ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికార్డు కలిగి ఉన్నారు.
భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పటికీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరు మీదే ఉంది. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. డర్బన్ లో జరిగిన ఆ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే.
గడిచిన 18 ఏళ్లుగా ఏ భారతీయ బ్యాటర్ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. తాజాగా హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆ రికార్డుకు దగ్గరగా వచ్చినా, కేవలం 4 బంతుల తేడాతో యువరాజ్ రికార్డు ను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ, హార్దిక్ ఇన్నింగ్స్ టీ20 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.