
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 హంగామా అధికారికంగా మొదలవుతోంది. స్కాట్లాండ్‌లోని ప్రసిద్ధ గ్లాస్గో నగరంలో ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. జూలై 23 గురువారం రోజున ఓవిఓ హైడ్రో అరేనా లో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామన్వెల్త్ దేశాల నుంచి వేలాది మంది అత్యుత్తమ అథ్లెట్లు ఈ క్రీడా సంబరంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. మొత్తం 11 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగనున్నాయి. స్పోర్ట్స్ లవర్స్‌కు రాబోయే రోజుల్లో అసలైన వినోదం లభించనుంది.
గ్లాస్గోలోని నాలుగు ప్రధాన స్టేడియాల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్లాస్గో ఇంటర్నేషనల్ అరేనా, స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్, స్కాట్‌స్టౌన్ స్టేడియం, టోల్‌క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్‌లలో వివిధ క్రీడా పోటీలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ప్రారంభ కార్యక్రమాలు జరగనున్నాయి.
భారతీయ క్రీడాభిమానులకు ఈ ప్రారంభోత్సవ వేడుక సమయం చాలా ముఖ్యమైనది. గురువారం (జూలై 23) రాత్రి భారత కాలమానం ప్రకారం సరిగ్గా 10:30 గంటలకు ఈ వేడుక ప్రారంభం అవుతుంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం ఒవిఓ హైడ్రో అరేనాలో జరిగే ఈ ఓపెనింగ్ సెరిమనీ క్రీడా ప్రియులను అలరించనుంది.
జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ఈ 11 రోజుల పోటీలలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడలలో మెడల్ ఈవెంట్లు జరగనున్నాయి. ప్రతీ రోజూ హోరాహోరీ పతకాల పోరు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి వేళ ఈ ఈవెంట్ ప్రారంభమవుతుండటంతో క్రీడాభిమానులు ఆన్‌లైన్, టీవీలలో వీక్షించడానికి రెడీ అవుతున్నారు.
ఈసారి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత జట్టుకు ప్రత్యేక ఆకర్షణగా మన ఒలింపిక్ మెడలిస్టులు నిలవనున్నారు. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని ముందుండి నడిపించే గౌరవాన్ని ఒలింపిక్ పతక విజేతలు లవ్లీనా బొర్గోహైన్, మీరాబాయి చాను దక్కించుకున్నారు.
భారత ఫ్లాగ్ బేరర్లుగా మాత్రమే కాకుండా, దేశం తరఫున బాటన్ బేరర్లుగా కూడా వీరిద్దరే వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన బాక్సర్ లవ్లీనా, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానులకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల భారత క్రీడా ప్రపంచం ఎంతో గర్విస్తోంది. వేలాది మంది అథ్లెట్ల మధ్య భారత త్రివర్ణ పతాకంతో మన మహిళా ఛాంపియన్లు మార్చ్ పాస్ట్ చేయడం అందరికీ గర్వకారణం కానుంది.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెరిమనీలో సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్కాటిష్ సింగర్-సాంగ్ రైటర్ కేటీ టన్‌స్టాల్, ఫోక్ సింగర్, డ్యాన్సర్ నాథన్ ఈవాన్స్, అలాగే ప్రముఖ స్కాటిష్ మ్యూజిక్ గ్రూప్ ‘సెయింట్ పిహెచ్ఎన్ఎక్స్’ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ వేడుకకు రాజకుటుంబం కూడా హాజరవుతోంది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమిల్లా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. కింగ్ చార్లెస్ III ఈ కామన్వెల్త్ గేమ్స్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. రాజకుటుంబం హాజరవుతుండటంతో గ్లాస్గోలోని ఓవిఓ హైడ్రో అరేనా వద్ద భద్రతను కూడా అత్యున్నత స్థాయిలో ఏర్పాటు చేశారు.
భారత్‌లోని క్రీడాభిమానులు ఈ మెగా క్రీడోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి లైవ్ టెలికాస్ట్, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. టీవీ ఛానెళ్లలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ గేమింగ్ ఈవెంట్‌ను ప్రసారం చేస్తోంది. సోనీ స్పోర్ట్స్ టెన్ 2 SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హిందీ SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో లైవ్ చూడాలనుకునే వారు 'సోనీ లివ్' (Sony LIV) యాప్ ద్వారా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ పొందవచ్చు.
ఈ క్రీడలు ఆగస్టు 2న ముగింపు వేడుకతో పూర్తవుతాయి. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలో భాగంగా తదుపరి ఆతిథ్య నగరానికి అధికారికంగా జెండాను అందజేస్తారు. నెక్స్ట్ 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్‌లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2030లో జరగబోయే ఈ ఈవెంట్ కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది వేడుక కావడం విశేషం. గ్లాస్గో నుంచి ఈ క్రీడా జ్యోతి భారత్‌కు చేరుకోనుండటం భారతీయులందరికీ ఎంతో గర్వకారణం.