
జులై 23 నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో లో కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈసారి భారత జట్టుకు తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. ఎందుకంటే ప్రతిసారి భారత్‌కు ఎక్కువ మెడల్స్ తెచ్చిపెట్టే రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి కీలకమైన క్రీడలను నిర్వహకులు ఈసారి తొలగించారు. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, భారత్ 125 మంది అథ్లెట్లతో కూడిన బలమైన బృందాన్ని బరిలోకి దించుతోంది. భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈసారి మిగిలిన ప్రధాన క్రీడలపైనే పూర్తి దృష్టి సారించింది.
ఈ పోరులో మన దేశం తరఫున పతకాల పంట పండించడానికి భారత మహిళా అథ్లెట్లు ముందువరసలో నిలిచారు. వారి ప్రతిభ, కఠిన శ్రమతో గ్లాస్గో లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు అత్యధిక పతకాలు తెచ్చిపెట్టే ప్రధాన క్రీడగా అథ్లెటిక్స్ నిలవనుంది. పురుషుల జావెలెక్ త్రోలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా భారత బృందానికి నాయకత్వం వహిస్తుండగా, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, సుదూర రేసుల రన్నర్ గుల్వీర్ సింగ్, హైజంపర్ తేజస్విన్ శంకర్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇక మహిళల విభాగంలో సుదూర రేసుల స్టార్ పార్ముల్ చౌదరి, రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి పతకాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
ట్రాక్ అండ్ ఫీల్డ్ తర్వాత భారత్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నవి వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్ ఆటలే. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ పతక విజేత సాయిఖోమ్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో భారత్‌కు ప్రధాన ఆశాకిరణంగా ఉంది. ఆమెకు తోడుగా బిందియారాణి దేవి సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరోవైపు బాక్సింగ్ రింగ్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) పంచ్‌లు విసిరేందుకు రెడీ అయింది. ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు) వంటి పవర్‌ఫుల్ బాక్సర్లు కూడా భారత్‌ను పతకాల పట్టికలో పైకి తీసుకెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తరఫున పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉన్న ఆ పది మంది అత్యుత్తమ మహిళా అథ్లెట్ల వివరాలు గమనిస్తే..
• పారుల్ చౌదరి (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్/5000 మీటర్లు): లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో పారుల్ చూపించే ఓర్పు, వ్యూహాత్మక శైలి ఆమెను మెడల్ రేసులో ముందుంచుతున్నాయి. ఫ్రాన్స్‌లోని నైస్ లో జరిగిన పోటీల్లో 5000 మీటర్ల రేసును 15:04.26 నిమిషాల్లో పూర్తి చేసి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
• పూజా సింగ్ (హైజంప్): భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త సంచలనం పూజా సింగ్. ఆసియా యు-20 ఛాంపియన్‌షిప్‌లో 1.93 మీటర్ల ఎత్తు ఎగిరి, 14 ఏళ్ల నాటి సీనియర్ జాతీయ రికార్డును తిరగరాసి స్వర్ణ పతకం సాధించింది.
• ప్రియాంక గోస్వామి (10,000 మీటర్ల రేస్ వాక్): బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన అనుభవం ప్రియాంకది. 2026 వరల్డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో మారథాన్ రేస్ వాక్‌లో 10వ స్థానంలో నిలిచి, భారత మహిళల జట్టును 5వ స్థానంలో నిలిపింది.
• సీమా కాలిరామ్నా (డిస్కస్ త్రో): పీహెచ్‌డీ రీసెర్చ్, మాతృత్వం, క్రీడలను సమానంగా సమర్థంగా బ్యాలెన్స్ చేస్తున్న అథ్లెట్ సీమా. 2025 నేషనల్ గేమ్స్‌లో తన భర్త కమ్ కోచ్ మార్గదర్శకంలో 52.07 మీటర్ల త్రోతో స్వర్ణం గెలుచుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది.
• ప్రీతి పవార్ (బాక్సింగ్ - 54 కేజీలు): రింగ్‌లో ప్రత్యర్థులపై వేగంగా విరుచుకుపడే బాక్సర్ ప్రీతి. ఆసియా యూత్, సీనియర్ స్థాయిలో పతకాలు సాధించిన ఆమె, పంచ్ స్పీడ్, టాక్టికల్ మైండ్‌తో పతకం ఖాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.
బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ సూపర్ స్టార్స్
• లవ్లీనా బొర్గోహైన్ (బాక్సింగ్ - 75 కేజీలు): ఒలింపిక్ పతక విజేత అయిన లవ్లీనా డిఫెన్సివ్ టెక్నిక్స్, కౌంటర్ పంచ్‌లలో దిట్ట. కొత్త వెయిట్ కేటగిరీకి మారిన తర్వాత కూడా అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, గ్లాస్గోలో స్వర్ణ పతకానికి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
• జైస్మీన్ లంబోరియా (బాక్సింగ్ - 57 కేజీలు): పొడవైన చేతులు, అద్భుతమైన చురుకుదనంతో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో జైస్మీన్ దిట్ట. లివర్‌పూల్‌లో జరిగిన 2025 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి తన ఫామ్‌ను నిరూపించుకుంది.
• సాయిఖోమ్ మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్ - 48 కేజీలు): భారత వెయిట్‌లిఫ్టింగ్ మకుటం లేని మహారాణి మీరాబాయి చాను. ఒలింపిక్ రజత పతక విజేత, ప్రపంచ ఛాంపియన్ అయిన మీరాబాయి, ఒత్తిడిలోనూ బరువులు ఎత్తుతూ కామన్వెల్త్ గేమ్స్‌లో మరో స్వర్ణం సాధించేందుకు సిద్ధమైంది.
• బిందియారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్ - 58 కేజీలు): గత కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన బిందియారాణి, ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించగలదు. తన పర్సనల్ బెస్ట్ స్కోర్లతో ఈసారి కూడా పతకం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
• తులికా మాన్ (జూడో - +78 కేజీలు): 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించడమే కాకుండా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తులికా, హెవీవేట్ విభాగంలో పవర్‌హౌస్. 2025 నేషనల్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆమె, గ్లాస్గోలో ప్రత్యర్థులను చిత్తు చేసి భారత్‌కు పతకం తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉంది.
ముఖ్యమైన క్రీడలు రద్దయినప్పటికీ, ఈ పది మంది మహిళా అథ్లెట్లు తమ అసాధారణ నైపుణ్యాలు, పట్టుదలతో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్‌ను విజేతగా నిలిపేందుకు శ్రమిస్తున్నారు.