India vs South Africa : ఓపెనర్లు ఫ్లాప్.. మిడిల్ ఆర్డర్ డీలా ! ముంచేశారు భయ్యా

Published : Feb 22, 2026, 11:57 PM IST

India vs South Africa : టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా 3 వికెట్లతో మెరిసినా, భారత బ్యాటర్ల ఘోర వైఫల్యంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. సౌతాఫ్రికా బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు.

PREV
16
బుమ్రా మెరిసినా.. బ్యాటర్లు ముంచేశారు: సఫారీల చేతిలో భారత్ చిత్తు

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను కట్టడి చేసే ప్రయత్నం చేసినా , బ్యాటర్లు రాణించలేకపోయారు. తమ బాధ్యతారహిత ఆటతీరుతో టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. 188 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది.

26
బుమ్రా స్పెల్.. సఫారీలపై పైచేయి

టాస్ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగిన భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రమాదకరమైన క్వింటన్ డి కాక్ (6) వికెట్‌ను తీసి సఫారీలను దెబ్బతీసిన బుమ్రా , ఆ తర్వాత డెత్ ఓవర్లలో కార్బిన్ బాష్‌ను అవుట్ చేసి తన బౌలింగ్ పదును చూపించాడు. బుమ్రా వేసిన స్లో బాల్స్, యార్కర్లు సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయి. ఈ మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (33) తీసిన బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.

36
భారత జట్టు టాప్ ఆర్డర్ డకౌట్ కష్టాలు

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆరో బంతికే సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ టోర్నీలో భారత ఓపెనర్లు వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఆందోళన కలిగించే అంశం. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (15) ఒక సిక్సర్, రెండు ఫోర్లు బాది ఆశలు రేపినా, మార్కో జాన్సన్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ (1) కూడా రివ్యూ కోల్పోయి త్వరగానే అవుట్ అయ్యాడు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

46
సూర్యకుమార్ పోరాటం వృథా

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) క్రీజులోకి వచ్చిన వెంటనే రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, వేగంగా పరుగులు రాబట్టాలనే ఒత్తిడిలో కార్బిన్ బాష్ వేసిన పేస్ డెలివరీని సరిగ్గా టైం చేయలేక బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ అవుట్ కావడంతో భారత్ సగం వికెట్లను 57 పరుగుల వద్దే కోల్పోయింది. అప్పటికే కావాల్సిన రన్ రేట్ 12 దాటిపోవడంతో భారత్ ఆశలు ఆవిరి అయ్యాయి.

56
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు.. కుప్పకూలిన మిడిల్ ఆర్డర్

మిడిల్ ఆర్డర్‌లో శివం దూబే (42) ఒంటరి పోరాటం చేశాడు. 37 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అతనికి మిగతా వారి నుంచి సహకారం లభించలేదు. 15వ ఓవర్‌లో కేశవ్ మహరాజ్ స్పిన్ మ్యాజిక్ చేస్తూ హార్దిక్ పాండ్యా (18), రింకూ సింగ్ (0), అర్షదీప్ సింగ్ (1)లను అవుట్ చేసి భారత్ పతనాన్ని శాసించాడు. ఈ ముగ్గురి క్యాచ్‌లను ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా పట్టుకోవడం విశేషం. బౌండరీ లైన్ వద్ద అతను పట్టిన క్యాచ్ లు హైలెట్ గా నిలిచాయి.

66
బౌలర్లు సరే.. బ్యాటర్ల మాటేమిటి?

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (63), ట్రిస్టన్ స్టబ్స్ (44*) మెరుపులు మెరిపించగా, భారత్ తరఫున ఏ ఒక్కరూ కనీసం హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. వాషింగ్టన్ సుందర్ (11) కూడా బాధ్యతారహితంగా షాట్ ఆడి అవుట్ అయ్యాడు. బుమ్రా, అర్షదీప్ వంటి బౌలర్లు శ్రమించి వికెట్లు తీసినా, బ్యాటర్లు కనీసం పోరాటం కూడా ప్రదర్శించకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ ఓటమి ద్వారా భారత్ రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories