
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా జరిగిన 43వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో టీమిండియా 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆరంభం ఆశించిన స్థాయిలో లేదు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ధాటికి కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్వింటన్ డి కాక్ (6), ఐడెన్ మార్క్రామ్ (4), ర్యాన్ రికెల్టన్ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ జట్టును ఆదుకున్నారు.
మిల్లర్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తం 35 బంతుల్లో 63 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. బ్రెవిస్ 29 బంతుల్లో 45 పరుగులు చేసి అతనికి సహకరించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44*) వేగంగా ఆడటంతో దక్షిణాఫ్రికా 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్ ఇషాన్ కిషన్ సున్నాకే అవుట్ కాగా, అభిషేక్ శర్మ 15 పరుగులకే వెనుదిరిగాడు. తిలక్ వర్మ కూడా 1 పరుగుకే అవుట్ కావడంతో భారత్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. భారత ఓపెనర్లలో ఒకరు ఈ టోర్నీలో వరుసగా నాలుగోసారి డకౌట్ కావడం గమనార్హం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేసి ఆశలు రేపినా, కార్బిన్ బాష్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ (11), హార్దిక్ పాండ్యా (18) కూడా విఫలమవడంతో భారత్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. శివం దూబే 37 బంతుల్లో 42 పరుగులు చేసినా, అది కేవలం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ స్పిన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్‌లో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్ వికెట్లను తీసి భారత్ ను కోలుకోకుండా చేశాడు . ఈ మూడు వికెట్లను ట్రిస్టన్ స్టబ్స్ క్యాచ్‌లు పట్టడం విశేషం. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో మూడు క్యాచ్‌లు పట్టిన రెండో ఫీల్డర్‌గా స్టబ్స్ రికార్డు సృష్టించాడు. మార్కో జాన్సన్ 3 వికెట్లు పడగొట్టి భారత్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. కార్బిన్ బాష్ కూడా రెండు కీలక వికెట్లు తీసి తన వంతు పాత్ర పోషించాడు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన క్లాస్ చూపించాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. బుమ్రా టీ20 వరల్డ్ కప్‌లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (33) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే అతనికి మిగతా బౌలర్ల నుంచి సరైన సహకారం అందలేదు. ఈ ఓటమితో భారత్ తన సూపర్ 8 గ్రూప్ దశలో ఒత్తిడిలో పడింది. దక్షిణాఫ్రికా ఈ విజయంతో సెమీఫైనల్ రేసులో ముందంజ వేసింది.