BCCI గ్రేడ్స్ అంటే ఏమిటి? భారత క్రికెటర్లు ఎంత సంపాదిస్తారు?

Published : Jan 20, 2026, 09:44 PM IST

BCCI : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. అగార్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులతో కోహ్లీ, రోహిత్ గ్రేడ్లు మారి, వారి వార్షిక వేతనం తగ్గే అవకాశముంది. బీసీసీఐ గ్రేడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ప్లేయర్లు ఎంత సంపాదిస్తారు?

PREV
16
క్రికెటర్ల జీతాల లెక్కలివే: ఏ గ్రేడ్ ప్లేయర్‌కు ఎంత డబ్బు వస్తుందంటే?

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో, అక్కడ నిలదొక్కుకుంటే వచ్చే ఆదాయం అంత భారీగా ఉంటుంది. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో బీసీసీఐ (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రతిపాదనలతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల గ్రేడ్లు మారే అవకాశం ఉంది. అసలు ఈ గ్రేడ్లు అంటే ఏమిటి? వాటి ఆధారంగా ఆటగాళ్లు ఎంత సంపాదిస్తారు? కొత్త ప్రతిపాదనలు అమలైతే ఎవరికి ఎంత నష్టం వస్తుంది? అనే పూర్తి వివరాలు గమనిస్తే..

26
అసలు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి?

బీసీసీఐ తన ఆటగాళ్లకు ఇచ్చే వార్షిక ఆర్థిక భరోసాయే ఈ సెంట్రల్ కాంట్రాక్ట్. దీనిని యాన్యువల్ రీటైనర్ అని కూడా అంటారు. ఒక ఆటగాడు జాతీయ జట్టుకు ఎంపికై మ్యాచ్‌లు ఆడినా, ఆడకపోయినా.. ఈ కాంట్రాక్ట్ పరిధిలో ఉంటే ఏడాదికి నిర్ణీత మొత్తం వేతనంగా అందుతుంది. ఇది ఆటగాళ్లు ఆడే మ్యాచ్ ఫీజులకు పూర్తిగా అదనం. ఆటగాళ్ల ప్రదర్శన, వారు ఆడే ఫార్మాట్ల ఆధారంగా బీసీసీఐ వారిని నాలుగు గ్రేడ్లుగా విభజించింది.

ప్రస్తుత గ్రేడ్ల వారీగా వార్షిక వేతనాలు (2024-25 ప్రకారం)

  1. గ్రేడ్ ఏ+ : రూ. 7 కోట్లు (అన్ని ఫార్మాట్లలో మ్యాచ్ విన్నర్లు).
  2. గ్రేడ్ ఏ : రూ. 5 కోట్లు (కనీసం రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాళ్లు).
  3. గ్రేడ్ బి : రూ. 3 కోట్లు (ఒక ఫార్మాట్‌లో రెగ్యులర్ లేదా బోర్డర్ లైన్ ఆటగాళ్లు).
  4. గ్రేడ్ సి : రూ. 1 కోటి (యువ ఆటగాళ్లు, ఎంట్రీ లెవల్ ప్లేయర్లు).
36
బీసీసీఐ కొత్త ప్రతిపాదనతో రాబోతున్న భారీ మార్పులు

బీసీసీఐ త్వరలో ఈ విధానాన్ని పూర్తిగా మార్చే యోచనలో ఉందని సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రస్తుతం ఉన్న నాలుగు గ్రేడ్ల (A+, A, B, C) విధానాన్ని రద్దు చేసి, కేవలం మూడు గ్రేడ్లు (A, B, C) మాత్రమే ఉంచాలని ప్రతిపాదించినట్లు ఏఎన్ఐ రిపోర్టులు పేర్కొంటున్నాయి.

దీని ప్రకారం అత్యున్నత విభాగమైన గ్రేడ్ ఏ+ (రూ. 7 కోట్లు) రద్దయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రస్తుతం ఏ+లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి స్టార్ల వేతనాలు మారవచ్చు. బీసీసీఐ తదుపరి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

46
కోహ్లీ, రోహిత్‌ల ఆదాయం ఎందుకు తగ్గుతోంది?

క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఉన్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయి, కేవలం వన్డేలకే పరిమితమయ్యారు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం, లిమిటెడ్ ఫార్మాట్ అంటే కేవలం ఒక ఫార్మాట్ ఆడే ఆటగాళ్లను గ్రేడ్ బి (Grade B)లో చేర్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఏ+ గ్రేడ్ ద్వారా ఏడాదికి రూ. 7 కోట్లు పొందుతున్న ఈ ఇద్దరు స్టార్లు, గ్రేడ్ బికి మారితే వారి వార్షిక వేతనం రూ. 3 కోట్లకు పడిపోతుంది. అంటే ఏడాదికి సుమారు రూ. 4 కోట్ల మేర వారు అందుకునే మొత్తంలో తగ్గుతుంది.

56
మ్యాచ్ ఫీజుల లెక్కలు ఎలా ఉంటాయి?

వార్షిక కాంట్రాక్ట్ డబ్బులే కాకుండా, ఆటగాళ్లు మైదానంలోకి దిగి ఆడే ప్రతీ మ్యాచ్‌కూ బీసీసీఐ ప్రత్యేకంగా డబ్బులు చెల్లిస్తుంది. దీనిని మ్యాచ్ ఫీజు అంటారు.

  1. ఒక టెస్టు మ్యాచ్‌కు: రూ. 15 లక్షలు
  2. ఒక వన్డే మ్యాచ్‌కు: రూ. 6 లక్షలు
  3. ఒక టీ20 మ్యాచ్‌కు: రూ. 3 లక్షలు

ఒక ఆటగాడు సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా అదనపు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అయితే, కోహ్లీ, రోహిత్‌లు ఇప్పుడు టెస్టులు, టీ20లు ఆడటం లేదు కాబట్టి, ఆ ఫార్మాట్ల ద్వారా వచ్చే భారీ మ్యాచ్ ఫీజులను కూడా వారు కోల్పోతున్నారు. కేవలం వన్డేల ద్వారా వచ్చే రూ. 6 లక్షల మ్యాచ్ ఫీజు మాత్రమే వారికి లభిస్తుంది.

66
ఐపీఎల్ ఆదాయమే అసలైన బలం

బీసీసీఐ ఇచ్చే జీతాలు తగ్గినా, భారత స్టార్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కాసుల వర్షం కురిపిస్తోంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ కంటే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయమే చాలా రెట్లు ఎక్కువ.

  • విరాట్ కోహ్లీ: 2008 నుంచి ఐపీఎల్‌లో ఉన్న కోహ్లీ, కేవలం లీగ్ కాంట్రాక్టుల ద్వారానే ఇప్పటివరకు రూ. 212.44 కోట్లు ఆర్జించారు. 2025 సీజన్ కోసం ఆర్సీబీ (RCB) అతనికి ఏకంగా రూ. 21 కోట్లు చెల్లిస్తోంది.
  • రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకుంటున్న ప్లేయర్లలో ఒకరు. ఇప్పటివరకు రూ. 194 కోట్లకు పైగా సంపాదించారు. 2025 సీజన్‌కు గాను ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 16.3 కోట్లకు రీటైన్ చేసుకుంది.

కాబట్టి, బోర్డు గ్రేడ్లు తగ్గించినా, ఐపీఎల్ ద్వారా ఈ స్టార్లు ఆర్థికంగా బలంగానే కొనసాగుతున్నారు. త్వరలో జరగబోయే బీసీసీఐ సమావేశంలో కొత్త కాంట్రాక్ట్ విధానంపై క్లారిటీ రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories