India vs Australia : భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే గురువారం అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనుంది. మొదటి మ్యాచ్ లో వానదెబ్బతో భారత్ కు షాక్ తగిలింది. మరి రెండో వన్డే రోజు వాతావరణం ఎలా వుండనుంది? పిచ్ రిపోర్టు ఎలా ఉంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. తొలి వన్డే పెర్త్ లో జరిగింది. రెండో మ్యాచ్ గురువారం (అక్టోబర్ 23న) అడిలైడ్ ఓవల్ గ్రౌండ్ లో జరగనుంది. మొదటి వన్డేలో వర్షం కారణంగా ఆటను పలుమార్లు నిలిపేయాల్సి వచ్చింది.
వర్షం మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపింది. భారత్ ఓడిపోవడంలో ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. సిరీస్‌ను కోల్పోకుండా ఫైట్ చేయడానికి రెండో వన్డే భారత్‌కు అత్యంత కీలకం. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు పూర్తి 50 ఓవర్ల మ్యాచ్ జరగాలని ఆశిస్తోంది.
26
అడిలైడ్ వాతావరణ ఎలా ఉంటుంది? వర్షం పడే అవకాశాలు ఎంత?
వాతావరణ నివేదికల ప్రకారం, అడిలైడ్ ఓవల్ లో గురువారం వర్షం పడే అవకాశాలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నాయి. బుధవారం (మ్యాచ్‌కు ముందు రోజు) చిరుజల్లులు పడే అవకాశం ఉన్నా, మ్యాచ్ రోజున పెద్దగా అంతరాయం కలిగే అవకాశం లేదు. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నా, నిరంతర వర్షం ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి మ్యాచ్ పై వర్షం ప్రభావం వుండదు. పూర్తి 50 ఓవర్ల ఆట జరగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
36
మొదటి వన్డే పై వర్షం ప్రభావం
ఈ సిరీస్ లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో వర్షం కారణంగా ఆటను నాలుగు సార్లు నిలిపివేయాల్సి వచ్చింది. వర్షం దెబ్బతో మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. భారత్ 26 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 136 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యం ఉంచారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుత ఇన్నింగ్స్‌తో 21.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. దీంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
అడిలైడ్ ఓవల్ పిచ్ ఆస్ట్రేలియాలోని బెస్ట్ బ్యాటింగ్ పిచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది సాఫ్ట్, ఫ్లాట్ పిచ్ కావడంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం సులభం. స్వల్ప బౌన్స్ ఉన్నా అది ఆటలో ఆసక్తిని పెంచుతుంది. ఈ పిచ్‌లో స్పిన్నర్లకూ కొంత సహాయం ఉంటుంది. భారత్ వద్ద ఉన్న క్వాలిటీ స్పిన్ దాడి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని సిరీస్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది.
56
అడిలైడ్ చేరుకున్న భారత జట్టుకు అభిమానుల ఘన స్వాగతం
రెండో వన్డే కోసం భారత జట్టు పెర్త్ నుంచి అడిలైడ్ చేరుకుంది. దీపావళి రోజు అడిలైడ్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా మొత్తం జట్టుకు ఘనంగా స్వాగతం పలికారు. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టుపై అభిమానుల నుంచి ఉత్సాహభరితమైన స్పందన కనిపించింది. సోషల్ మీడియాలో అభిమానుల స్వాగతం వీడియోలు వైరల్ అవుతున్నాయి.
66
సిరీస్ సమం చేయాలన్న లక్ష్యంతో భారత్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుమారు ఏడు నెలల విరామం తర్వాత బ్యాట్ పట్టారు. భారీ అంచనాల మధ్య మొదటి వన్డేలో భారత్ తరపున ఆడారు. కానీ ఆ మ్యాచ్‌లో ఇద్దరూ పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. రోహిత్ కేవలం 8 పరుగులు చేసి ఔటవ్వగా, కోహ్లీ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇప్పుడు రెండో వన్డేలో ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్లు జట్టుకు విజయాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
పెర్త్ లో వర్షం ఆటను ఆపడంతో భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చింది. ఇప్పుడు గిల్ నాయకత్వంలోని జట్టు అడిలైడ్ లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో ఈ మ్యాచ్ అభిమానులకు క్రికెట్ థ్రిల్లర్‌గా మారే అవకాశం ఉంది.