అద్భుత ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ ను ఎందుకు పక్కనపెట్టారు?

Published : Oct 21, 2025, 08:04 PM IST

India A Squad : గత 5 ఏళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 117 సగటుతో పరుగుల వరదపారిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే, ఆయనకు ఇండియా A  జట్టులో కూడా చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ టీమ్ కు రిషబ్ పంత్ కెప్టెన్ గా ఉన్నాడు.

PREV
15
అద్భుత ఫామ్ లో సర్ఫరాజ్ ఖాన్.. తప్పని షాక్

గత ఐదు సంవత్సరాలుగా దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పరుగుల వరద పారిస్తున్నా.. అతనికి ఇండియా ‘ఏ’ జట్టులో చోటుదక్కకపోవడమే ఇందుకు కారణం. బీసీసీఐ ప్రకటించిన జాబితాలో అతని పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 117.47 సగటుతో 2,467 పరుగులు, 10 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేసిన ఈ ముంబై బ్యాటర్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

బరువు తగ్గాడు, ఫిట్ అయ్యాడు, రోహిత్ శర్మకు డీఆర్‌ఎస్ సలహా ఇచ్చేంత తెలివైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయినా కూడా అతనికి జట్టులో స్థానం దక్కలేదు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌పై కూడా పరుగులు చేసిన సర్ఫరాజ్ ఇప్పుడు ఏ జట్టుకూ ఎంపిక కాలేదు.

25
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయం

అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం ఇండియా ‘ఏ’ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు మళ్లీ లేకపోవడం గమనార్హం.

సెలెక్టర్ల నిర్ణయంపై ఎటువంటి స్పష్టత లేకపోవడం గమనించదగ్గ అంశం. సర్ఫరాజ్‌కు ఫిట్‌నెస్, ఫామ్ రెండూ ఉన్నప్పటికీ, అతనిని ఎంపిక చేయకపోవడంతో కొత్త చర్చ మొదలైంది.

35
విమర్శల మధ్య బరువు తగ్గి ఫిట్‌నెస్ టెస్టును క్లియర్

గతంలో సర్ఫరాజ్ ఖాన్ బరువు, ఫిట్‌నెస్‌పై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతను 17 కిలోల బరువు తగ్గి, ఫిట్‌నెస్ టెస్ట్ కూడా క్లియర్ చేశాడు. అయినప్పటికీ, ఇండియా ‘ఏ’ జట్టులో అతనికి స్థానం ఇవ్వలేదు.

సెప్టెంబర్ 25న ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో అతను మ్యాచ్ ఫిట్‌నెస్ కారణంగా స్థానం కోల్పోయాడు. కానీ అతను 27న ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేశాడు. అయినప్పటికీ, ఫిట్‌నెస్ ఆధారంగా మళ్లీ తీసుకోలేదు. 

45
ఇంగ్లాండ్‌లో రాణించినా సర్ఫరాజ్ కు గుర్తింపు రాలేదు

ఇంగ్లాండ్ లయన్స్‌పై ఇండియా ‘ఏ’ తరఫున 92 పరుగులు చేసిన సర్ఫరాజ్, ఇంటర్నల్ మ్యాచ్‌లో బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ 102 పరుగులు చేశాడు. అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కలేదు.

న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల సిరీస్‌లో 171 పరుగులతో మూడవ అత్యధిక రన్‌గెటర్‌గా నిలిచాడు. అయినప్పటికీ, ఆ ప్రదర్శన సర్ఫరాజ్ కెరీర్‌లో మార్పు తీసుకురాలేదు. అతన్ని ఎంపిక చేయకపోవడం ప్రతిభపై నమ్మకం లేకపోవడమేనా లేక అంతర్గత కారణాలున్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇంకా లభించలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్ పేరు మళ్లీ ఇండియా ‘ఏ’ జట్టులో లేకపోవడం సెలక్షన్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది.

55
ఇండియా ‘ఏ’ జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్

బీసీసీఐ ప్రకటించిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మొదటి మ్యాచ్ అక్టోబర్ 30న, రెండో మ్యాచ్ నవంబర్ 6న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతాయి.

రెండో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఆడనున్నారు.

ఇండియా ‘ఏ’ జట్టు (1వ మ్యాచ్)

రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రాజత్ పటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మనవ్ సూతార్, అంషుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సరాంశ్ జైన్.

ఇండియా ‘ఏ’ జట్టు (2వ మ్యాచ్)

రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మనవ్ సూతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.

Read more Photos on
click me!

Recommended Stories