IPL 2026 : సన్‌రైజర్స్ సిక్సర్ల కింగ్.. అభిషేక్ శర్మ షేక్ చేస్తాడా?

Published : Mar 26, 2026, 04:42 PM IST

Abhishek Sharma : 2026 టీ20 ప్రపంచకప్ లో నిరాశపర్చిన అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. గతంలో ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అభిషేక్.. ఈ సీజన్ లో మెరుపులు మెరిపిస్తాడా? లేదా?

PREV
16
అభిషేక్ శర్మ విధ్వంసం మొదలు.. ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ వైస్ కెప్టెన్ రికార్డుల వేట

టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో భారత్ అదగొట్టింది. ఇప్పుడు మళ్లీ మరో క్రికెట్ ఫీవర్ మొదలుకానుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత అందరి దృష్టి ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్‌పై పడింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. గత రెండు సీజన్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించిన ఈ 25 ఏళ్ల సంచలనం.. ఈసారి తనను తాను మరోస్థాయిలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

26
టీ20 ప్రపంచకప్ : అభిషేక్ శర్మ ఒడిదుడుకుల ప్రయాణం

అభిషేక్ శర్మకు 2026 టీ20 ప్రపంచకప్ ఒక అగ్నిపరీక్షలా నిలిచింది. టోర్నమెంట్‌కు ముందు నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా బరిలోకి దిగిన అతను, ప్రారంభ మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురైన అభిషేక్, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతని పై వరుసగా విమర్శలు వెల్లువెత్తాయి. జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, సూపర్ 8 దశలో జింబాబ్వేపై 55 పరుగులతో ఫామ్ అందుకున్న అభిషేక్, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విశ్వరూపం చూపాడు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు.

36
ఐపీఎల్: పరుగుల వర్షం కురిపించే యంత్రం అభిషేక్

ఐపీఎల్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఒక భయంకరమైన బ్యాటర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించడం అతనికి అలవాటు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో అతను మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. 2024లో 200 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు, 2025లో 193.39 స్ట్రైక్ రేట్‌తో 439 పరుగులు చేయడం అభిషేక్ దూకుడుకు నిదర్శనం. 2025లో పంజాబ్ కింగ్స్‌పై కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు.

46
ట్రావిస్ హెడ్‌తో అభిషేక్ శర్మ విధ్వంసకర భాగస్వామ్యం

సన్‌రైజర్స్ విజయాల్లో అభిషేక్ శర్మ - ట్రావిస్ హెడ్ జోడీ వెన్నెముకగా నిలిచింది. వీరిద్దరి మధ్య ఉన్న సమన్వయం ప్రత్యర్థి బౌలింగ్ అటాక్‌ను కుప్పకూలుస్తుంది. హెడ్ పేసర్లపై విరుచుకుపడితే, అభిషేక్ పేస్, స్పిన్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కొంటాడు. 2025లో వీరిద్దరూ కలిసి 171 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ క్రీజులో ఉంటే పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు బోర్డు 80-90 పరుగులు దాటడం ఖాయం.

56
అభిషేక్ శర్మ ఐపీల్ రికార్డులు ఇవే

అభిషేక్ శర్మ ఐపీఎల్ కెరీర్ గణాంకాలు చూస్తే అతను ఎంతటి ఇంపాక్ట్ ప్లేయరో అర్థమవుతుంది..

  • మ్యాచ్‌లు: 77
  • మొత్తం పరుగులు: 1,816
  • స్ట్రైక్ రేట్: 163.02
  • సిక్సర్లు: 101
  • అత్యధిక స్కోరు: 141 (2025లో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకోవడం అతని విలువను చాటి చెబుతోంది. ఈ సీజన్‌లో అతను 2,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 184 పరుగుల దూరంలో ఉన్నాడు.

66
ఐపీఎల్ 2026: అభిషేక్ పై భారీ అంచనాలు.. ముందున్న సవాళ్లు

ఐపీఎల్ 2026లో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇషాన్ కిషన్ సారథ్యంలో అతను జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు అభిషేక్ తన దూకుడుకు కొంచెం పరిణతిని జోడించాలని సూచిస్తున్నారు. ప్రతి బంతిని సిక్సర్‌గా మలచాలనే ప్రయత్నంలో వికెట్ పారేసుకోకుండా, ఇన్నింగ్స్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 42 బంతుల్లో 94 పరుగులు చేయడం ద్వారా అతను తన ఫామ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. మరి ఐపీఎల్ 2026 సీజన్ లో అభిషేక్ శర్మ షేక్ చేస్తాడో లేదా షేక్ అవుతాడో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories