RCB vs SRH : ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తలపడనున్నాయి. అయితే గత ఏడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటన కారణంగా ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీ ప్రారంభోత్సవం విషయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించడం లేదని బోర్డు అధికారికంగా ప్రకటించింది.
26
గత ఏడాది విషాదం నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
గత ఏడాది ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఈ విజయం తర్వాత బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ సభలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అభిమానుల తాకిడి పెరగడంతో జరిగిన భారీ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనను స్మరిస్తూ, మరణించిన వారికి నివాళిగా ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి ఆర్భాటాలు, వేడుకలు లేకుండానే టోర్నీని ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.
36
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు అనుమతి
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై గత వారం వరకు ప్రశ్నలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ప్రమాదం దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆ షరతులన్నింటినీ నెరవేర్చిన తర్వాతే, గత వారం బీసీసీఐకి స్టేడియం వినియోగించుకోవడానికి అనుమతి లభించింది. భద్రతా కారణాల దృష్ట్యా కూడా ప్రారంభ వేడుకలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రారంభ వేడుకలను రద్దు చేయడం బీసీసీఐకి ఇది మొదటిసారి కాదు. గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా అప్పటి ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీని కూడా బీసీసీఐ రద్దు చేసింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు బెంగళూరు దుర్ఘటన బాధితుల పట్ల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే జరుగుతుందని, ఎలాంటి బాలీవుడ్ ప్రదర్శనలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని బోర్డు స్పష్టం చేసింది.
56
ఘనంగా ఐపీఎల్ ముగింపు వేడుకలు
ప్రారంభ వేడుకలు లేకపోయినా, మే 31న జరిగే ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధృవీకరించారు. టోర్నీ ఆఖరి క్షణాలు అభిమానులకు గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మే నెలాఖరు వరకు సాగే ఈ క్రికెట్ పండుగలో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి.
66
అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్‌సీబీ
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హాట్ టాపిక్ గా మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్‌సీబీ జట్టును రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్‌సీబీ అవతరించింది. యాజమాన్యం మారిన తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో పాటు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో కోహ్లీ సేనపై భారీ అంచనాలు ఉన్నాయి.