
హిందూ ధర్మంలో సుమంగళిని దేవతతో పోలుస్సతారు. పెళ్లైన స్త్రీ నుదుటన సింధూరం, మెడలో మంగళసూత్రం, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు ధరించడం సంప్రదాయంగా భావిస్తారు. దీని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉంటే, మరికొన్ని జ్యోతిష్య కారణాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. స్త్రీ ధరించే ప్రతి ఒక్కటి భర్త ఆయుష్షు, ఆరోగ్యానికి సంబంధించినదిగా పరిగణిస్తారు.
మహిళ నదుటన కుంకుమ పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు. భర్తను చెడు శక్తుల నుంచి కాపాడటానికి మెడలో మంగళసూత్రం ధరిస్తారు. అలా రెండు పాదాల మధ్య మూడు కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. మెడలో బంగారం ధరిస్తే.. కాళ్లకు మాత్రం వెండి ధరిస్తారు. దీనికి సూర్య చంద్రులను ఉదాహరణగా చెబుతారు. కేవలం గ్రహాలు మాత్రమే కాదు.. కాలికి పెట్టుకున్న మెట్టెలు భర్త పేదరికానికి కూడా కారణం కావచ్చు. అసలు స్త్రీలు తమ కాళ్లకు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి? అవి, భర్త అభివృద్ధికి ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం...
కాలివేళ్ళ ఉంగరాలు( మెట్టెలు) ధరించడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఈ రోజుల్లో కాలివేళ్ళ ఉంగరాలు ధరించడం ఫ్యాషన్ గా మారిపోయింది. రకరకాల మోడల్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఫ్యాషన్ పేరిట పెళ్లికాని అమ్మాయిలు కూడా మెట్టెలు ధరిస్తున్నారు. కానీ, శాస్త్రాలలో కాలివేళ్ళ ఉంగరాల గురించి చాలా విషయాలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కాని స్త్రీలు కాలివేళ్ళ మెట్టెలు ధరించకూడదు. వీటిని తప్పుగా ధరిస్తే భర్తకు ఆపద వస్తుందని శాస్త్రం చెబుతోంది.
మెట్టెలు పోతే భర్తకు కష్టం: కాళ్ళకు వేసుకునే మెట్టెలు చంద్రుడికి సంబంధం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. భార్యాభర్తలకు సూర్యచంద్రుల ఆశీర్వాదం అవసరం. వెండి కాలివేళ్ళ ఉంగరాలు ధరిస్తే చంద్రుడు ఐశ్వర్యం ప్రసాదిస్తాడని నమ్ముతారు. అదే మెట్టెలు పోతే అది అశుభం గా పరిగణనిస్తారు. అంతేకాదు.. మెట్టెలు పోతే భర్త అనారోగ్యానికి గురవుతాడని అంటారు. అందుకే పెళ్లైన స్త్రీలు మెట్టెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
బంగారు మెట్టెలకు దూరంగా ఉండండి: చాలామంది బంగారు మెట్టెలు ధరిస్తారు. ఇది మంచిది కాదు. బంగారం ధరించడం వల్ల పెద్ద నష్టానికి దారితీస్తాయి. ఫ్యాషన్ పేరుతో వెండి కాకుండా ఇతర లోహాలతో చేసిన కాలివేళ్ళ ఉంగరాలు ధరించడం కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయ్యింది. కానీ.. ఇది కూడా మంచిది కాదు. కేవలం వెండి మాత్రమే ధరించాలి. ఇక.. ఈ మెట్టెలు కాలి వేళ్ల నుంచి జారిపోయేంత వదులుగా ఉండకూడదు. వేళ్ళకు సరిపోయే ఉంగరాలు కొనండి.
ఒకరి మెట్టెలు మరొకరికి : కొంతమంది స్త్రీలు తమ ఆభరణాలను పంచుకుంటారు. కానీ పెళ్లైన స్త్రీ తన మెట్టెలను ఇతర స్త్రీలకు ఇవ్వడం అశుభం. దీనివల్ల వైవాహిక జీవితంలో కలతలు రావచ్చు. అందుకే మీ మెట్టెలను ఇతరులకు ఇవ్వకండి. అంతేకాకుండా.. రోజూ ధరించడం వల్ల ఈ మెట్టెలు అప్పుడప్పుడు అరిగిపోతూ ఉంటాయి. ఇది చాలా సహజం. కానీ, అరిగిపోయిన వాటిని ఎప్పుడూ ధరించకండి. వాటిని మార్చి కొత్తవి కొనుక్కోండి.
ఏ వేలికి ధరించాలి?: శాస్త్రం ప్రకారం, పెళ్లైన స్త్రీలు కుడి, ఎడమ పాదాల రెండో వేలికి మెట్టెలు ధరించడం మంచిది. వెండి మెట్టెలు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్త్రీల పాదాల రెండో వేలి నరం నేరుగా గర్భాశయానికి సంబంధించినది. ఇది గుండె ద్వారా వెళుతుంది. అందుకే కుడి, ఎడమ పాదాల రెండో వేలికి ఉంగరాలు ధరిస్తే గర్భాశయ ఆరోగ్యం బాగుంటుంది, రక్తపోటు కూడా సరిగ్గా ఉంటుంది.