Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?

Published : Feb 26, 2026, 05:24 PM IST

Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తం ఎంతో బలమైనదని చెబుతారు. ఆ సమయంలోనే లేవాలని అంటారు. ఈ ముహూర్తంలో నిద్ర లేచి చేసే పనులు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి. 

PREV
14
బ్రహ్మ ముహూర్తం అంటే ఏ సమయం?

బ్రహ్మ ముహూర్తానికి హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన భావన ఉంది. ఎంతో మందికి బ్రహ్మ ముహూర్త సమయం అంటే ఏమిటో తెలియదు. సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఉండే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ శబ్దం తక్కువగా ఉండటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు, చదువుకు, ధ్యానానికి, యోగాకు ఉత్తమమైనదిగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో లేచే వారికి మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, జీవితంలో విజయాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఈ సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే రోజు మొత్తం చురుకుగా గడుస్తుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.

24
ప్రశాంతమైన జపం

బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన ముఖ్యమైన పని మంత్ర జపం, ధ్యానం. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని దేవుని ధ్యానం చేయడం లేదా మంత్రాలను జపించడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గి ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఈ సమయంలో యోగా లేదా శ్వాస అభ్యాసం చేస్తే ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఉదయం లేచి చదివితే త్వరగా గుర్తు ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఈ సమయంలో రోజువారీ పనులను ప్లాన్ చేసుకుంటే సమయం వృథా కాకుండా ఉంటుంది. చిన్ని చిన్న అలవాట్లు జీవితంలో ఎంతో మార్పును తెస్తుంది.

34
కర దర్శనం చేయండి

బ్రహ్మ ముహూర్తంలో కచ్చితంగా చేయాల్సిన పని కరదర్శనం. అంటే నిద్రలేవగానే చేతులు రెండింటినీ కలిపి చూడాలి. ఈ సంప్రదాయం వెనుక భావం ఏమిటంటే మన చేతులే మన జీవితాన్ని నిర్మిస్తాయని అర్థం. మన కృషి, మన శ్రమే విజయానికి దారి తీస్తుందని చెప్పే సంకేతంగా దీనిని భావిస్తారు. ఇలా ఉదయం మంచి ఆలోచనతో రోజు ప్రారంభమైతే ఆ రోజు మొత్తం సానుకూలంగా సాగుతుంది. అదేవిధంగా బ్రహ్మ ముహూర్తంలో లేచి తేలికపాటి వ్యాయామం చేయడం, కొద్దిసేపు నడకకు వెళ్లడం, పుస్తకాలు చదవడం కూడా మంచిదే. ఈ సమయంలో మెదడు తాజాగా ఉండటం వల్ల ఏ పని చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

44
దీని వల్ల లాభాలు

బ్రహ్మ ముహూర్తంలో లేచే అలవాటు ఆరోగ్యపరంగా కూడా మంచిది. త్వరగా లేవడం వల్ల నిద్ర పద్ధతి సరిగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అలసటగా అనిపించదు. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మొబైల్, టీవీ వల్ల రాత్రి ఆలస్యంగా పడుకునే అలవాటు పెరుగుతున్న ఈ రోజుల్లో బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక మంచి మార్పుగా చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా ఈ అలవాటు పెంచుకోవడం కష్టం. కాబట్టి మెల్లగా అలవాటు చేసుకోవాలి. మొత్తానికి బ్రహ్మ ముహూర్తం కేవలం ఆధ్యాత్మిక సమయం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవనానికి మంచి ఆరంభం కూడా.

Read more Photos on
click me!

Recommended Stories