ప్రపంచంలో కలిసి ఉండే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా బేధాభిప్రాయాలు రావడం అన్నది సహజం. ఇలాంటి బేధాభిప్రాయాలు వారి యొక్క బంధం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని బంధాలు కొన్ని రోజులు తర్వాత రాజీ పడినా, కొన్ని బంధాలు మాత్రం విషాదకరమైన ముగింపుకి దారితీస్తాయి.
అలాంటి ఒక అందమైన బంధం అది స్నేహబంధమైన, ప్రేమైనా మరి ఏదైనా మళ్లీ తిరిగి కొనసాగించాలంటే ఈ చిట్కాలు పాటించండి. ముందుగా అసలు ఎక్కడ సమస్య వచ్చింది అన్న విషయాన్ని కనుక్కోండి. ఆ తర్వాత విడిపోయిన బంధాన్ని నిలబెట్టుకోవటం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
అందమైన బంధం కోసం వదులుకోలేని ఆత్మీయుని కోసం ఒక మెట్టు దిగినా పర్వాలేదు కాబట్టి అహాన్ని వీడండి. మీరు మీ స్నేహితునితో లేదా ప్రేమికునితో శాంతి ఒప్పందాన్ని ప్రకటించాలని అనుకుంటే ఆ విషయం అతనికి తెలిసేలాగా ప్రవర్తించండి.
ఒక అందమైన బంధం బలంగా ఉండటం కోసం అవతలి వాళ్ళు ఒక మెట్టు దిగి మీ దగ్గరికి రావాలని ఎప్పుడూ ఎదురు చూడకండి, అదే ప్రయత్నం మీరు చేయండి.సమస్యలని పరిష్కరించటం లో మొదటి ప్రయత్నం మీరు చేసి..
మీ స్నేహానికి లేదా ప్రేమకి ఎంత విలువ ఇస్తున్నారో ఎదుటి వ్యక్తికి తెలిసేలాగా చేయండి. మీరు ఒక మెట్టు తగ్గి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా తన అహాన్ని వీడే ప్రయత్నం చేస్తారు. జరిగిన సంఘటనలో మీ తప్పు ఉంటే క్షమాపణ చెప్పటానికి ఏమాత్రం ఆలోచించకండి.
ఒకవేళ ఎదుటి వ్యక్తిది తప్పు అనిపిస్తే ఆ విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎదుటి వ్యక్తి మీతో కలవడానికి ఇష్టపడకపోతే అతని నిర్ణయాన్ని గౌరవించండి.ఎందుకంటే బలవంతంగా వచ్చే ప్రేమ అయినా స్నేహమైనా సంతృప్తిని మిగల్చదని తెలుసుకోండి.