
పెళ్లి అయిన తరువాత చాలా మంది వెంటనే పిల్లల్ని కనాలి అనుకుంటారు.కొంతమంది మాత్రం కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటారు. కానీ అసలు పిల్లల్ని మీకు మీరుగా కనాలి అనుకుంటున్నారా..లేక సమాజం కోసం,ఇంట్లో పెద్దవారి కోసం కనాలని అనుకుంటున్నారా...అనే విషయం గురించి మాత్రం ఓ సారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని పెంచడం కేవలం ప్రేమతో కాదు, పూర్తిగా సిద్ధంగా ఉండే ఓ నిబద్ధతతో కూడిన జీవన ప్రయాణం.
మొదటగా, మీరు పిల్లలను ఎందుకు కనాలనుకుంటున్నారు? నిజంగా మీకు పిల్లల అవసరమా? లేక ఇంట్లో పెద్దవాళ్ల ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పగలిగితేనే మీరు ఈ నిర్ణయానికి సిద్ధంగా ఉన్నారని అర్థం.
కొంతమంది పెద్దలు మనవళ్లు కావాలని ఆశిస్తారు. తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో మన పిల్లల గురించి ముందుగానే ప్రణాళికలు వేస్తుంటారు.
కానీ వారి కోరిక కోసమే పిల్లలు కనడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే మీరు తల్లిదండ్రులు అవుతారు, బాధ్యత మీ మీదే ఉంటుంది. పిల్లల భవిష్యత్తు ఒక మాదిరిగా నిర్ణయించే విషయం కాదు, అది ఒక జీవితాంత ప్రయాణం.ఇంకొంత మంది ఏం అనుకుంటారంటే - పిల్లలు కలిగితే భార్యభర్తల మధ్య బంధం బలపడుతుంది. అయితే ఇది తప్పు. సంబంధంలో అప్పటికే ఉన్న సమస్యలు పిల్లలతో మాయమవుతాయనే భావన చాలా ప్రమాదకరం. పిల్లలతో కలిసి ఉన్నపుడు మరింత ఒత్తిడి, సమయం, ఆర్థిక భారాలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడులు పెరగొచ్చు, సంబంధాలు మెరుగుపడకపోవచ్చు.
మరికొంత మంది తమ పురుషత్వం లేదా స్త్రీత్వాన్ని నిరూపించుకోవడానికే పిల్లలు కావాలనుకుంటారు. సమాజం అలాంటి తప్పుడు అంచనాలు పెడుతూ ఉంటే, వాళ్లను సవాలు చేయడం కంటే తలొగ్గడం తేలికగా అనిపించొచ్చు. కానీ, పిల్లలు మీ గౌరవానికి సాక్ష్యం కావాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా, స్థిరంగా ఉన్నపుడే వారి జీవితంలోకి రావడం మంచిది.
కొన్ని జంటలు అందరిలా కాకుండా భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ పిల్లల్ని కంటున్నారనేదే వారి ప్రేరణ. ఇది కూడా ప్రమాదకరమైన తప్పుడు కారణం. పిల్లల్ని పెంచడం అన్నది ఫ్యాషన్ కాదు. ఇది ఒక జీవిత బాధ్యత. మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేనప్పుడు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
ఇంకొంతమంది తల్లిదండ్రులు భావిస్తారు – తమ జీవితంలో సాధించలేకపోయినవాటిని పిల్లల ద్వారా సాధించాలన్న ఆశ. అయితే ఇది పిల్లల పట్ల అన్యాయంగా ప్రవర్తించడమే అవుతుంది. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం వేరు. పిల్లల వ్యక్తిత్వం వారికే చెందాలి.వారి ఆలోచనలు వారికే ఉండాలి.మన కోరికలు, ఆశలు,కలలు వారి మీద ఎప్పటికీ రుద్దకూడదు.
ఈ కారణాలన్నింటిలోనూ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు పిల్లల్ని ప్రేమగా, సమర్థంగా పెంచగలరా అనే ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పగలగడం. పిల్లలు ఒక సంబంధాన్ని బలపరచే సాధనం కావు. వారు ఒక బాధ్యత, ఒక ప్రయాణం. మీరు తమకు కావలసిన ప్రేమ, సంరక్షణ, సమయం ఇవ్వగలరా అనే విషయాన్ని గమనించాలి.
పిల్లలు కనాలనే ఆలోచన ముందు, మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా? మీ జీవిత పరిస్థితులు దానికి అనుకూలమా? ఈ ప్రశ్నలపై స్పష్టత ఉండాలి. కుటుంబ ఒత్తిడి, సమాజ ఆశలు, వ్యక్తిగత అసంతృప్తుల కారణంగా నిర్ణయం తీసుకోవడం కాకుండా, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.
మీ జీవితాన్ని మార్చే అతి కీలకమైన ఈ నిర్ణయం ముందు ఒక సారి ఆలోచించండి. తల్లి తండ్రిగా మారడం అనేది ఒక బాధ్యత. మీరు నిజంగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయాణం ప్రారంభించండి.