పెళ్లాం మొగుడి మధ్య గొడవలు, కొట్లాటలు చాలా కామన్. ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతుంటాయి. సర్దుమనుగుతుంటాయి. ఇక ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకోరు. ఒకరి ముఖాలను ఒకరు చూసుకోరు. కానీ సగం పూటో లేదా ఒక్కరోజు తర్వాత మళ్లీ బాగా మాట్లాడుకుంటారు. అయితే గొడవ జరిగిన తర్వాత తెలిసో తెలియకో చేసే కొన్ని పనుల వల్ల మీరిద్దరూ మళ్లీ గొడవ పడే అవకాశం ఉంది. అందుకే మీరు గొడవ పడ్డ తర్వాత చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దేనివల్ల గొడవ
కొట్లాట ఇక్కడితో ఆపేయాలనుకుంటే మాత్రం అసలు మీ గొడవ దేనివల్ల మొదలైందో దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడకండి. ముఖ్యంగా మీరే తప్పు చేసి ఉంటే. దీనివల్ల మళ్లీ గొడవ మొదలవుతుంది. గొడవ ఎక్కడ మొదలైందో తెలుసుకుని సయోధ్య గురించి ఆలోచిస్తే పొరపాటే. ఎందుకంటే ఇది కొన్ని కొన్ని సార్లు భాగస్వామి కోపాన్ని మరింత పెంచుతుంది.
రాజీపడినట్టు నటించడం
మీరు గొడవను సర్దుబాటు చేయాలనుకుంటే మాత్రం నాదే తప్పైందని మాత్రం నటించకండి. ఎందుకంటే ఒక్కోసారి విపరీతమైన భావోద్వేగాలు బయటకు వచ్చి ఆ తర్వాత దానిపై గొడవ పడొచ్చు. ఒకవేళ తప్పు మీది అయితే దానిని సులభంగా అంగీకరించండి. క్షమించమని అడగండి. ఏది ఏమైనా పరిస్థితులను అర్థం చేసుకుని గొడవను ముగించడానికి ప్రయత్నించండి. కానీ చాలా మంది జంటలు రాజీపడుతున్నట్టు నటిస్తారు. ఇది మీ రిలేషన్ షిప్ కు అంత మంచిది కాదు. మీ భాగస్వామితో మీకు ఏదైనా సమస్య ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుని పరిష్కరించుకోండి.
తొందరపడకండి
గొడవను పరిష్కరించడానికి తొందరపడటం సరికాదు. ఏదైనా ఒక విషయంపై వాదోపవాదాలు జరిగితే భాగస్వామి మనసు చల్లబడే అవకాశం ఇవ్వండి. మాట్లాడుకుని గొడవను పరిష్కరించే మార్గాన్ని వెతకండి. దీని కోసం మంచి అవకాశం కోసం వెయిట్ చేయండి. కోపంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు. ఇలాంటి సమయంలో మంచి విషయం కూడా చెడుగా అనిపిస్తుంది. గొడవ జరిగిన తర్వాత ఒకరినొకరు కాసేపు ఒంటరిగా వదిలేసి తిట్టడం మానుకోండి.