పెళ్లైన ప్రతి దంపతులు తమ జీవితంలో మరో చిన్నారి అడుగుపెట్టాలని కలలు కంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో ఇది చాలా కష్టమే అవుతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది దంపతులు సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. ఫెర్టిలిటీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుూ.. వేలల్లో ఖర్చు చేసుకున్నారు.
అయితే వీర్యంలో లోపాలు ఉన్నా, వీర్యకణాల్లోని జన్యుపదార్థంలో లోపాలు ఉన్నా అండం ఫలదీకరణ జరగదు. ఒకవేళ జరిగినా మూడు నెలలు తిరగకుండానే అబార్షన్ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చకపోవడానికి మహిళల మీదే అపవాదు మోపుతూ ఉంటారు. కానీ దీనిలో పురుషులకూ సమ బాధ్యత ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణాలు..
వీర్య పరిమాణం సుమారుగా 1.5 మిల్లీ లీటర్ల నుంచి 2 మిల్లీ లీటర్ల పరిమాణం ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.
గర్భధారణకు అవసరమైన వీర్యకణాల సంఖ్య, ఒక మిల్లీలీటరుకు 15 మిలియన్ల నుంచి 30 మిలియన్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉన్నట్టు భావించాలి.
వీర్యం రంగు తెల్లగా ఉండాలి. పచ్చగా ఉంటే ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు, ఎర్రగా ఉంటే వీర్యంలో రక్తం కలుస్తున్నట్టు అర్థం. ఈ సమస్యలు ఉన్నా గర్భధారణ సాధ్యపడదు
వీర్యం జిగటగా ఉండాలి. నీళ్లలా ఉంటే హర్మోన్ల సమస్య ఉందని అర్థం. ఇలాంటి పల్చని వీర్యం గర్భధారణ జరగనివ్వదు.
చిక్కగా ఉండే వీర్యం గది ఉష్ణోగ్రత దగ్గర 15 నిమిషాల్లో కరిగిపోవాలి. ఇలా జరగకపోతే వీర్యంలో ఇన్‌ఫెక్షన్ ఉందని అనుకోవాలి. ఇన్‌ఫెక్షన్ గర్భధారణకు ప్రధాన అడ్డంకి అని తెలుసుకోవాలి.
వీర్యంలో కదిలే శుక్రకణాలు 32శాతం ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉందని భావించాలి. శుక్ర కణం, తల, తోక, ఆకార నిర్మాణంలో లోపాలు. ఈ లోపాల కారణంగా శుక్రకణం అండంలోకి ప్రవేశించలేదు.
వీర్యకణాలు స్వతంత్రంగా కదలకుండా, ఒకదానికి మరొకటి అతుక్కుపోయి ఉండవచ్చు. ఇందుకు ఇన్‌ఫెక్షన్లే కారణం.
బిగుతైన లోదుస్తులు ధరించడం, ఎక్కువ సమయం పాటు కుర్చీల్లో కూర్చుని పని చేయడం, వేడితో కూడిన వాతావరణంలో పని చేయడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుంది.
వీటిలో ఏ లోపం ఉన్నా.. పిల్లలు పుట్టడం కష్టమే. ఒకేవేళ గర్భం దాల్చినా వెంటనే అబార్షన్ జరుగుతుంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.