భార్యాభర్తల అన్యోన్యత గురించి ఒక కథ చెప్పుకుందాం. దాని ద్వారా భార్యాభర్తల మధ్య సానుకూల దృక్పథం ఉంటే విజయాన్ని ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉంటారు. ఆ భార్య వట్టిపోయిన గేదెని అమ్మివేరే ఏదైనా వస్తువు తీసుకు రమ్మంటుంది.
అయితే ఆ రోజులలో డబ్బులకి కాకుండా వస్తు మార్పిడి జరుగుతూ ఉండేది. కాబట్టి ఆ భర్త గేదెని గుర్రానికి మారుగా ఇచ్చేశాడు. గుర్రం గుడ్డిది కావటంతో ఆ గుర్రాన్ని ఆవుకి మారుగా ఇచ్చేశాడు. తీరా ఆవుకి పళ్ళు లేకపోవడంతో మేకకి మారుగా ఇచ్చేశాడు.
ఆ మేక కూడా ఏదో లోపంతో ఉండటంతో కోడికి మారుగా ఇచ్చేశాడు. కోడి పందెంలో పాల్గొనడం వల్ల ఒంటినిండా గాయాలతో ఉండటం వల్ల చిరాకు పడిన ఆ వ్యక్తి ఒక రూపాయికి ఆ కోడిని అమ్మేశాడు.
అప్పటికే మధ్యాహ్నం కావటంతో ఆ రూపాయితో భోజనం కొనుక్కొని తిందామని అనుకునే లోపు ఒక ముష్టివాడు వచ్చి బిచ్చం అడిగితే వాడికి ఇచ్చేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోతాడు.
జరిగిందంతా భార్యకి చెప్పటంతో ఆమె భర్తని ఏమీ అనకుండా పోనీలే ఒక పేదవాడి ఆకలి తీర్చావు. ఇప్పటికే లేట్ అయింది పద భోజనం చేద్దాం అని చెప్పి భోజనం చేస్తారు. వీరి అన్యోన్యతని గుర్తించిన ఆ దేశపు రాజు వారికి గుర్రం, ఆవు, మేక, కోడి, వజ్రాలు బహుమతిగా ఇస్తారు.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భర్తని అర్థం చేసుకొని ఆ భార్య సంసారం సజావుగా చేస్తే ఆ సంసారం ఎంతో చక్కగా సాగుతుంది. సానుకూల దృక్పథం ఉన్న భార్యభర్తల పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా ఆదర్శవంతులుగా తయారవుతారు.