ఎలాంటి గర్భనిరోదక మాత్రలు వాడకున్నా.. ఈ మధ్యకాలంలో చాలా మంది సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే... ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ముందుగానే తెలియజేస్తూ... కొన్ని లక్షణాలు స్త్రీ, పురుషులలో కనిపిస్తాయట.
ఆ లక్షణాలను కనుక మనం ముందుగానే గుర్తించగలిగితే.. వెంటనే వాటిని పరిష్కరించుకోవచ్చుంటున్నారు నిపుణులు. అయితే.. అవి పురుషులలో ఒక విధంగా, స్త్రీలలో మరో విధంగా ఉంటాయని చెబుతున్నారు.
పురుషుల విషయానికి వస్తే.. వీర్యం సరిగా లేకపోవడం వల్లే అసలు సమస్య వస్తుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వీర్యం రంగు, పొడవు, పరిమాణం అన్నీ సక్రమంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు.
పురుషుల వీర్యంలో సమస్యలు ఉంటే చాలా మందికి ప్రగ్నెన్సీ రాదు.. కొందరికి వచ్చినా రెండు, మూడో నెలల్లోనే అబార్షన్ జరిగే అవకాశం ఉంది. అలా తరచూ అబార్షన్ అవుతున్నా దాని కారణం వీర్యం సరిగా లేదు అనే అర్థమని నిపుణులు చెబుతున్నారు.
వీర్య పరిమాణం సుమారుగా 1.5మిల్లీ లీటర్ల నుంచి 2 మిల్లీ లీటర్ల పరిమాణం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
గర్భదారణకు అవసరమైన వీర్య కణాల సంఖ్య, ఒక మిల్లీలీటర్లకు 15 మిలియన్ల నుంచి 30 మిలియన్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉన్నట్లు ముందే గుర్తించాలి.
వీర్యం రంగు తెల్లగా మాత్రమే ఉండాలి. అలా కాకుండా పసుపు రంగులో ఉందంటే.. సమస్య ఉన్నట్లే అని గుర్తించాలి. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే పచ్చరంగులో ఉంటుంది. ఇక వీర్యం ఎర్రగా వస్తుంది అంటే.. దాంట్లో రక్తం కలుస్తుందని అర్థం. ఇలా ఉన్నా కూడా పిల్లలు కలగడం సాధ్యం కాదు.
ఇక వీర్యం జిగటగా ఉండాలి అలా కాకుండా నీళ్లమాదిరిగా ఉంటే హార్మోన్ల సమస్య ఉందని అర్థం. వీర్యం పలచగా ఉంటే గర్భదారణ జరగడం కష్టం. చిక్కగా ఉండే వీర్యం గది ఉష్ణోగ్రత దగ్గర 15 నిమిషాల్లో కరిగిపోవాలి. ఇలా జరగకపోతే వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.
ఇక వీర్యంలో కదిలే శుక్రకణాలుు 32శాతం ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉందని గుర్తించాలి.వీటిలో ఏది అనుమానంగా అనిపించినా వైద్యులను సంప్రదించాలి. తగిన ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఇకయ స్త్రీల విషయానికి వస్తే... అధిక బరువు: లావుగా ఉన్నప్పుడు కొవ్వు పొట్టలో ఎక్కువగా చేరుతుంది. ఈ కొవ్వు కారణంగా ఫిమేల్ హార్మోన్లు, మేల్ హార్మోన్లుగా మార్పు చెందుతాయి. దాంతో టెస్టోస్టెరాన్ పరిమాణం పెరిగిపోవడంతో అండాశయాల నుంచి అండాలు విడుదల కావు. దాంతో గర్భధారణ జరగదు. కాబట్టి.. సమతుల్య ఆహారం తీసుకుంటూ.. వ్యాయామం చేస్తే.. సులభంగా బరువు తగ్గవచ్చు.
పాలీసిస్టిక్ ఓవరీస్: ఈ సమస్య ఉన్నవాళ్లకు మొటిమలతో పాటు, ముఖం, గడ్డం మీద అవాంఛిత రోమాలు తలెత్తుతాయి. అలాగే నెలసరి కూడా ప్రతి నెలా ఆలస్యమవుతూ ఉంటుంది.
ఫైబ్రాయిడ్లు: ఈ సమస్య ఉన్న వారిలో నెలసరి స్రావం తీవ్రంగా ఉంటుంది. స్రావం గడ్డలు గడ్డలుగా ఉండవచ్చు. ఈ లక్షణాలు ఫైబ్రాయిడ్ సమస్యను సూచిస్తాయి. అయితే ప్రతి ఫైబ్రాయిడ్ వల్ల సమస్య ఉండకపోయినా, ఎన్ని ఉన్నాయి? ఎంత పెద్దగా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాల మీద గర్భం ధరించే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అవి గర్భసంచీలో ఉన్నా, పెద్దగా ఉన్నా, ఎక్కువ మొత్తంలో ఉన్నా గర్భధారణ జరగదు. వీటికి చికిత్స ఉంటుంది.
ఎండోమెట్రియాసిస్: నెలసరి సమయంలో నొప్పి ఉంటుంది. నెలసరి స్రావం కూడా తీవ్రంగా ఉంటుంది. అలాగే శారీరక కలయిక సమయంలో కూడా నొప్పి ఉంటుంది. గర్భసంచీ లోపల పెరగవలసిన పొర ఎండోమెట్రియం గర్భసంచీ బయట పెరగడమే ఈ సమస్యకు కారణం.
ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయనే అనుమానం మీకు కలిగితే... వెంటనే డాక్టర్లను సంప్రదించడండి. తద్వారా తగిన ట్రీట్మెంట్ వైద్యులు అందజేస్తారు. దాంతో... మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా సంవత్సరం తిరిగేలోగా మీ ఓడిలోకి చంటిపాపాయి వచ్చి చేరుతుంది.