కొంతమంది అవసరానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటే ఇంకొంతమంది మాత్రం తమ జీవితాన్ని మొత్తం సోషల్ మీడియాకే అంకితం చేస్తున్నారు. ఇలాంటి వారే ఎన్నో మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవితాల్లో ముఖ్యమైన అంశంగా మారిపోయింది. కానీ ఇది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కొంతమంది తమ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్లు ఏం చేస్తున్నారు వంటి ప్రతి విషయాన్ని లోకానికి చూపించాలని, పంచుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు చాలా సార్లు సోషల్ మీడియాలో బిజీబిజీగా ఉంటారు. దీనివల్ల మన నిజ జీవితంలోని వ్యక్తుల గురించి పట్టించుకోం. వారొకరు ఉన్నారన్న సంగతిని కూడా మర్చిపోతుంటాం. ఇదే బంధాలకు ముగింపు పలుకుతుంది.
సోషల్ మీడియా ఎన్నో సంబంధాలను విడదీస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే చాలా సార్లు సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటారు. ఇలాంటి వారు తమ భాగస్వామికి తగిన సమయం ఇవ్వలేకపోతుంటారు. సోషల్ మీడియాలో చాలా జంటలు వారి జీవితంలోని సంతోషకరమైన సంఘటనలను పంచుకుంటారు. దీని కారణంగా మీరు కూడా మీ భాగస్వామి నుంచి అదే ఆశిస్తారు. కానీ ప్రతి ఒక్కరి ప్రేమ, వ్యక్తీకరణ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు గొడవలు, బ్రేకప్ లకు కూడా దారితీస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అని మీ పార్టనర్ ప్రైవసీని కూడా పట్టించుకోరు. సోషల్ మీడియా మీ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతరులతో పోల్చడం లేదా అసూయపడటం
సోషల్ మీడియాలో లేనిదంటూ ఉండదు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా వారి విజయాలు, సంతోషకరమైన క్షణాల గురించి వెళ్లడిస్తారు. ఇలాంటి పోస్టులను చూసిన ప్రతిసారి మీ భాగస్వామి నుంచి కూడా మీరు అలాంటిదే ఆశిస్తారు. మీ జీవితాలను సోషల్ మీడియాలో చూసే ఆదర్శ జీవితాలతో పోల్చుకుంటారు. ఇది మీ రిలేషన్ షిప్ లో అసంతృప్తి, గొడవలకు దారితీస్తుంది.
నిజం కాని అంచనాలు
సోషల్ మీడియా సంబంధాల గురించి నమ్మడానికి లేవు. ఎందుకంటే అందులో వాస్తవం ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇలాంటి వాటిని చూస్తే మీకు ఇవి నిజమేననిపిస్తుంది. మీపై ఎంతో ప్రభావాన్నికూడా చూపుతాయి. సోషల్ మీడియాలో వారి సంబంధంలో సంతోషాలను, ఆనంద క్షణాలను మాత్రమే చెప్తారు. కానీ గొడవలు, కొట్లాటల గురించి చెప్పరు. ఇదే వీటిని చూసిన వారికి రిలేషన్ షిప్ పై విసుగొచ్చేలా చేస్తాయి. వారి జీవితం ఇలా ఉంది మా రిలేషన్ షిప్ ఇలా ఉందేంటి అనిపిస్తుంది.
గోప్యత ఉండదు
సామాజిక మాధ్యమాలు పబ్లిక్, ప్రైవేట్ లైఫ్ మధ్య హద్దులను చెరిపేస్తాయి. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, సంబంధాలకు సంబంధించిన విషయాలను సమ్మతి లేకుండా పంచుకోవచ్చని చూపిస్తాయి. దీంతో గోప్యతకు భంగం కలుగుతుంది. ఇది నమ్మక సమస్యలకు దారితీస్తుంది. అలాగే సంబంధాలను దెబ్బతీస్తుంది.
కలిసి సమయం గడపకపోవడం
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల భాగస్వామితో గడిపే సమయం తగ్గుతుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, ఇన్ఫర్మేషన్ ను చెక్ చేయడం, సంభాషణలలో పాల్గొనడం వల్ల నిజ జీవిత సంబంధాల్లో ఎక్కువగా ఉండరు. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతుంది. ఇది భాగస్వాములు, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మధ్య నిర్లక్ష్యం లేదా ఒంటరితనం భావాలకు దారితీస్తుంది.
అపార్థాలు పెరగడం
సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్లు అతి చురుగ్గా ఉండే వారు తమ రిలేషన్ షిప్ గురించి అంతగా పట్టించుకోరు. అంతేకాదు ఇది తప్పుడు కమ్యూనికేషన్, అపార్థాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారు మెసేజెస్ లను సులభంగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది బ్రేకప్ కు దారితీస్తుంది.