ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది పొద్దంతా ఏసీలను ఆన్ లోనే ఉంచుతుంటారు. అయితే కొంతమంది చిన్న పిల్లలు ఉక్కపోతలకు తట్టుకోలేరని ఏసీ రూముల్లోనే పడుకోబెడుతుంటారు. దీనివల్ల చిన్నారికి వేడిమి కాదని. కానీ ఏసీ చిన్న పిల్లలకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏసీ రూముల్లో చిన్న పిల్లల్ని రోజూ పడుకోబెట్టడం వల్ల వారి శారీరక ఎదుగుదల, ఇమ్యూనిటీ పవర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పిల్లలకు చల్లని గాలి, పొడి గాలి ఎప్పుడూ తగలడం వల్ల పిల్లల చర్మం పొడిబారుతుంది. అలాగే దురద కూడా పెడుతుంది. ఏసీ గాలి పిల్లల ముక్కు, గొంతుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీ పిల్లలకు శ్వాస సమస్యలు వస్తాయి.
ఏసీ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుంది?
సాధారణంగా ఏసీ ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. కానీ ఇది గాలిలో తేమను తగ్గిస్తుంది.దీని నుంచి వచ్చే పొడిగాలి శ్వాసకోశ వ్యవస్థపై చెడు ప్రభావం చూపెడుతుంది. ఇప్పటికే మీ పిల్లలకు ఉబ్బసం లేదా శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉంటే ఏసీలో మాత్రం పడుకోబెట్టకండి. ఒకవేళ పడుకోబెడితే పిల్లల నాసికా మార్గాలను ఎండిపోతాయి. దీనివల్ల పిల్లల శరీరంలోకి దుమ్ము, బ్యాక్టీరియా వెళ్లి రోగాలొచ్చేలా చేస్తాయి.
kids
మీకు తెలుసో.. లేదో.. చిన్న పిల్లలకు చల్ల గాలి అవసరం లేదు. పిల్లల పెరుగుదలకు సమతుల్య ఉష్ణోగ్రత మాత్రమే అవసరం. పిల్లలు చాలా చల్లని వాతావరణంలో ఉంటే వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం బలహీనపడుతుంది. అందుకే వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చినా జలుబు తొందరగా వస్తుంటుంది. అంతేకాకుండా చల్లని వాతావరణంలో చిన్నపిల్లల శరీర కార్యకలాపాలు క్రమంగా తగ్గుతాయి. దీనివల్ల వారి శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
ఏసీని ఎలా ఉపయోగించాలి?
ఏసీ వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఏసీని ఉపయోగించకూడదేమో అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దీని అర్థం ఏసీని అస్సలు ఉపయోగించకూడదని కాదు. ఎండాకాలంలో మీ అవసరాన్ని బట్టి మాత్రమే ఏసీని వాడాలి. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. ముఖ్యంగా గది ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోకుండా ఉండాలి. అలాగే గదిలో తగినంత మొత్తంలో హ్యూమిడిఫైయర్ ఉపయోగించడం వల్ల గాలిలో తేమను ఉంటుంది.
సహజ గాలి పిల్లలకు చేసే మేలు
చిన్న పిల్లలకు సహజ గాలే ఎంతో మేలు చేస్తుంది. అందుదే మీ గది కిటికీలను వీలైనంత వరకు తెరిచి ఉంచండి. అలాగే మీ పిల్లలకు రెగ్యులర్ గా ఉదయం సూర్యరశ్మిని చూపించండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ డిని అందిస్తుంది.