కొంతమంది మంది పిల్లలు ఎంత చదివినా, రాసినా.. నేర్చుకున్న విషయాన్ని చాలా త్వరగా మర్చిపోతుంటారు. అడిగితే గుర్తుకు లేదని చెప్తుంటారు. కానీ ఇది పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చదువులో వెనకబడేలా చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కొన్ని రకాల ఆహారాలు బాగా సహాయపడతాయి. ఇవి మీ పిల్లల ఏకాగ్రతను కూడా పెంచుతాయి.
Kids food
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు...
ఆకుకూరలు
ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్, ఫోలేట్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఫోలేట్ కలిగిన ఆకుకూరలు పిల్లల మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
గుడ్డు
గుడ్లు మంచి పోషకాహారం. ఇది మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డు పచ్చసొన కోలిన్ కు మంచి వనరు. గుడ్లలో విటమిన్ బి 6, విటమిన్ బి 12, ఫోలేట్, కోలిన్ తో పాటుగా మెదడును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
kids foods
చేపలు
చేపలు మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా మంచి కొవ్వులున్న చేపలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సార్డినెస్, మాకేరెల్, సాల్మన్ వంటి చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ చేపల్లో ఇపిఎ, డిహెచ్ఎ వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి.
వేరుశెనగ
వేరుశెనగ కూడా పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ ఇ నరాలను రక్షిస్తుంది. మెదడు పనితీరుకు అవసరమైన థయామిన్ కూడా వేరుశెనల్లో మెండుగా ఉంటుంది.
ధాన్యాలు
తృణధాన్యాల్లో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ బి పిల్లల్లో శ్రద్ధ, ఏకాగ్రతను పెంచుతుంది.
ఓట్స్
ఓట్స్ పెద్దలకే కాదు పిల్లలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. ఓట్స్ శరీరానికి, మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తుంది. అలాగే పిల్లలను మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఓట్స్ పిల్లల కడుపు నింపడమే కాకుండా వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.