wayanad landslides
కేరళలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. 2018 వరదలు మిగిల్చిన విషాదం నుంచి తేరుకోక ముందే మరో విపత్తు ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. అప్పట్లో (2018 ఆగస్టులో) రుతు పవనాల కారణంగా కురిసిన భారీ వర్షాలకు 164 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 85వేల మంది వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గడిచిన శతాబ్దంలో ఇదే భారీ విపత్తు అనుకుంటే.. అంతకు మించిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.
wayanad landslides: buried in the mud
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా ప్రాంతాల్లో రెండు రోజుల పాటు (జూలై 29, 30) భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కొండ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. జూలై 29న (సోమవారం) కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ గ్రామస్థులు అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం ధ్వంసమై.. గ్రామంలోని ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి. గ్రామస్థులంతా నిద్రలోనే బురద మట్టిలో కలిసిపోయారు.
wayanad landslides
కల్పత్త: ముండక్కైలో కొండచరియలు విరిగిపడటంతో గ్రామానికి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా కొనసాగుతోంది. విపత్తు సంభవించిన ప్రదేశంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య 168కి చేరుకుంది. కాగా, గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది.
wayanad landslides: Out of 400 houses only 30 are left
మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్‌లో కొంత మందిని బలగాలు కాపాడాయి. గాయపడిన 191 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో, 211 మంది గల్లంతైనట్లు కేరళ అధికారులు ప్రకటించారు. ఇక, పెంపుడు జంతువులు మాత్రమే మిగిలి ఉన్న ముండకై గ్రామంలో కన్నీటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముండకైలో 30 ఇళ్లు మాత్రమే మిగిలాయని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ అధికారిక లెక్కల ప్రకారం.. 400కి పైగా ఇళ్లు ఉండేవి.
wayanad landslides: Bailey Bridge
వాయనాడ్ ముండక్కై కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు బెయిలీ వంతెన నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తీసుకుని ప్రత్యేక విమానం బుధవారం ఉదయం 11 గంటలకు కన్నూర్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ 18 లారీలను ఏర్పాటు చేశారు. తర్వాత రోడ్డు మార్గంలో వాయనాడ్‌కు చేరుకొని... బెయిలీ వంతెన నిర్మాణం రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేస్తున్నట్లు కేరళ మంత్రి కె.రాజన్ తెలిపారు.
wayanad landslides: Supervision of Ministers
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు స్థానిక సంస్థలు తమ సొంత నిధులు వెచ్చించేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన ప్రతినిధి బృందాన్ని నియమించింది. నష్టాన్ని అంచనా వేయడానికి, తక్షణ ప్రతిస్పందన చర్యలను సమన్వయం చేయడానికి అటవీ శాఖ మంత్రి ఎ.కె. శశీంద్రన్ ప్రభావిత ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో ఆరుగురు మంత్రులు మకాం వేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాహుల్, ప్రియాంక గాంధీలు వయనాడ్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
wayanad landslides: Hundreds of people are missing
చురల్‌మల, ముండక్కై ప్రాంతాల్లో సైన్యం, వాలంటీర్ల నేతృత్వంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు చలియార్ నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 200 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉందని బంధువులు చెబుతున్నారు. కానీ, 98 మంది గల్లంతైనట్లు ప్రభుత్వ అధికారిక అంచనా. మరోవైపు, మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని తెలుస్తోంది.
wayanad landslides: 150 soldiers in relief operations
150 మంది సైనికులు 4 బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం చురల్‌మలలో సహాయక చర్యలు నిర్వహించారు. ఎజిమల నావల్ అకాడమీకి చెందిన 60 బృందాలు సహాయక చర్యల కోసం చురల్‌మల చేరుకున్నాయి. లెఫ్టినెంట్ కమాండెంట్ ఆశీర్వాద్ నేతృత్వంలోని బృందం వచ్చింది. ఈ బృందంలో 45 మంది నావికులు, ఐదుగురు అధికారులు, ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది, ఒక వైద్యుడు ఉన్నారు.
wayanad landslides
వయనాడ్ విపత్తులో ప్రభావితమైన వారి కోసం అవసరమైన వస్తువులను నిల్వ చేయడానికి ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం నేతృత్వంలో ఒక సేకరణ కేంద్రం ప్రారంభించారు. బుధవారం ఉదయం 9 గంటలకు కడవంతర ప్రాంతీయ క్రీడా కేంద్రంలో ఈ సేకరణను మొదలుపెట్టారు.
Difficulty exhuming bodies
ముండక్కైలో ధ్వంసమైన ఇళ్ల నుంచి మృతదేహాలను ఇంకా బయటకు తీస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ప్రాంతంలోని నాలుగు ఇళ్లలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. విచారకరమైన దృశ్యం ఏమిటంటే, మృతదేహాలు కూడా కుర్చీలపై కూర్చుని ఉన్నాయి. అయితే కూలిన ఇంటి నుంచి మృతదేహాలను బయటకు తీయడం కష్టతరంగా మారింది.
Rescue operation on one side, funeral on the other
ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా, మరోవైపు అంత్యక్రియలు కూడా కొనసాగుతున్నాయి. మెప్పాడి జుమా మసీదు శ్మశాన వాటిక, కప్పం కొల్లి జుమా మసీదు శ్మశాన వాటిక, నెల్లిముండ జుమా మసీదు శ్మశాన వాటికలో మృతదేహాలకు దహన సంస్కారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిలంబూరులో ఉంచిన మృతదేహాలను రెండున్నర గంటల్లో మేపాడికి తీసుకురానున్నారు. మంగళవారం రాత్రి 6 గంటలకు ఆగిపోయిన రెస్క్యూ ఆపరేషన్‌ను సైన్యం తిరిగి ప్రారంభించింది. సైన్యం నాలుగు బృందాలుగా విడిపోయి రెస్క్యూ మిషన్‌ను ప్రారంభించింది. ఏకాంత ప్రాంతాలకు చేరుకోవడానికి మరిన్ని బలగాలు రానున్నాయి. 20 గంటల సుదీర్ఘ రెస్క్యూ మిషన్ మంగళవారం రాత్రి ముగియగా... బాధిత ప్రజల కోసం 8 శిబిరాలు ఏర్పాటు చేశారు. 1,222 మంది బాధితులను శిబిరాలను తరలించారు.
Prime Minister Modi and President Murmu expressed shock
వయనాడ్ ఘటనపై ప్రధాన మోదీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం బాధ కలిగించిందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రమాదంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి.. అక్కడ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి సాధ్యమైంత మేరక అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
అలాగే, కేరళలోని వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, సహాయక చర్యలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.