Vijay emotional reaction on Karur stampede : కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ దళపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇస్తానని, నిజం త్వరలో వెలుగులోకి వస్తుందని అన్నారు.
తమిళనాడులోని కరూర్‌లో శనివారం రాత్రి జరిగిన టీవీకే అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ దళపతి ఎన్నికల ర్యాలీ ఒక్కసారిగా విషాదంలో ముగిసింది. సభలో అభిమానులు ఆయనను చూడటానికి గుంపులుగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ ఈ విషాదంపై స్పందించారు.
25
విజయ్ భావోద్వేగ వీడియో సందేశం
కరూర్ ఘటనపై తాజాగా విజయ్ స్పందించారు. ఓ భావోద్వేగ వీడియోలో ఆయన మాట్లాడుతూ, “నా జీవితంలో ఇలాంటి బాధ ఎప్పుడూ అనుభవించలేదు. నా గుండె ముక్కలైంది. ప్రజలు నన్ను చూడటానికి వచ్చారు కానీ ఇంతటి దురదృష్టకర సంఘటన జరగకూడదు” అని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, త్వరలో వారిని స్వయంగా కలుస్తానని చెప్పారు.
35
విజయ్ సభ భద్రతా ఏర్పాట్లపై సందేహాలు
విజయ్ తన ప్రసంగంలో ముఖ్యంగా కరూర్ సభ భద్రత అంశాన్ని ప్రస్తావించారు. “ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీకి నేను సిద్ధం కాను. ప్రతి ర్యాలీకి సురక్షిత ప్రదేశాలే ఎంచుకోవాలని మేము పోలీసులను కోరాం. ఐదు జిల్లాల్లో సభలు నిర్వహించాం, ఎక్కడా ఇలాంటి సమస్యలు రాలేదు. కానీ కరూర్‌లో మాత్రం ఎందుకు ఇలాంటిది జరిగింది?” అని ప్రశ్నించారు. ఆయన మాటల్లో ఘటన వెనుక కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై విజయ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను నేరుగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. “సీఎం సర్, మీకు ప్రతీకారం తీర్చుకోవాలంటే నాపై తీర్చుకోండి. నేను ఎప్పుడూ ఇంట్లోనో ఆఫీసులోనో ఉంటాను. కానీ నా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించకండి. నన్ను ఏమైనా చేసుకోండి కానీ ప్రజల జోలికి పోవద్దు” అంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
55
తమిళ రాజకీయ వాతావరణం వేడెక్కించిన కరూర్ ఘటన
కరూర్ ఘటన తర్వాత తమిళ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీవీకే నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం మరింత వివాదానికి దారి తీసింది. ఇదే సమయంలో డీఎంకే ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తూ, ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తోంది.